Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
ఈనెల 3న తలపెట్టిన ఛలో హైదరాబాద్ కార్యక్రమాన్ని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సింగరేణి కాంట్రాక్టు కార్మిక సంఘం (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కంపేటి రాజయ్య కోరారు. జిల్లా కేంద్రంలో కాంట్రాక్టు కార్మికులతో కలిసి ఛలో హైదరాబాద్ కార్యక్రమ కరపత్రాలను ఆదివారం ఆయన విడుదల చేసి మాట్లాడారు. సింగరేణి కాంటాక్ట్ కార్మికులకు జీఓ నెంబర్ 22 ప్రకారం నెలకు రూ.19 వేల 33లు వేతనం అమలు చేయాలన్న డిమాండ్‌తో 3న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. కాంట్రాక్ట్, అసంఘటిత కార్మికుల వేతనాలు పెంచకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఏడేండ్లుగా కనీస వేతన జీఓలను విడుదల చేయడం లేదని మండిపడ్డారు. ఓపక్క నిత్యావసర సరుకుల ధరలను పాలకులు పెంచుతూనే మరోవైపు వేతనాలు పెంచకుండా మోసపూరితంగా వ్యవహరిస్తున్నాయంటూ పాలక పార్టీల తీరును ఎండగట్టారు. కాంట్రాక్ట్, అసంఘటిత కార్మికుల పోరాటాల ఫలితంగా 2021 జూన్ 30న రాష్ట్ర ప్రభుత్వం ఐదు షెడ్యూల్డ్ పరిశ్రమలకు సంబంధించి కనీస వేతన జీఓలను విడుదల చేసినా యాజమాన్యాల ఒత్తిడితో గెజిట్ చేయకుండా నిలిపేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నాయకులు సుధాకర్, రాజు, భిక్షపతి, నాగరాజు, సదానందం, స్వామి, నరేష్, అమత, లక్ష్మి, శంకర్, మహేందర్, సంపత్, శ్రీనివాస్, సారయ్య తదితరులు పాల్గొన్నారు.