Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-స్టేషన్ ఘన్పూర్
అసంఘటిత కార్మికుల కోసం సమగ్ర చట్టం చేయాలని సీఐటీయూ జిల్లా నాయకులు కొడెపాక యాకయ్య కోరారు. ఆ యూనియన్ ఆధ్వర్యంలో తలపెట్టిన చలో హైదరాబాద్ వాల్పోస్టర్ను మండల కేంద్రంలో ఆదివారం ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్మికుల శ్రమ ఫలితంగా ప్రభుత్వ, ప్రైవేటు వ్యాపార సంస్థల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పన్నుల రూపంలో కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోందని చెప్పారు. అయినా పాలకులు హమాలీల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని మండిపడ్డారు. ఎగుమతి, దిగుమతి పనుల సందర్భంగా ప్రమాదాలు జరిగితే ఆదుకోవడం లేదన్నారు. కనీస వేతనాలు జీవో సవరణలే గాక, కార్మికుల సంక్షేమానికి పాలకులు పని భద్రత, గుర్తింపు కార్డులు, ఇపిఎఫ్, ఇఎస్ఐ, ప్రమాద బీమా, పెన్షన్ తదితర పథకాలతో కూడిన సమగ్ర చట్టం చేయాలన్నారు. కేంద్రం తెచ్చిన 4లేబర్ కోడులను రద్దుచేయాలని, 73 షెడ్యూల్డ్ పరిశ్రమల్లో కనీస వేతనాల్ని అమలు చేయాలని అన్నారు. తక్షణమే వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ, ఈనెల 3న సీఐటీయూ ఆధ్వర్యంలో జరిగే ఛలో హైదరాబాద్ కార్యక్రమానికి అన్ని రంగాల హమాలీలు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో వెలిశాల రాజు, అన్నేపు లింగయ్య, దైద రమేష్, రాములు, రవి, పర్శరాములు, రాములు, సాంబరాజు, తదితరులు పాల్గొన్నారు.