Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘాల ఆధ్వర్యంలో రాస్తారోకో
నవతెలంగాణ-హన్మకొండ
రైతాంగ ఉద్యమానికి దిగొచ్చిన ఇచ్చిన హామీలను విస్మరిస్తే కేంద్ర ప్రభుత్వ పతనం తప్పదని ఏఐకెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్రెడ్డి హంసారెడ్డి, ఏఐకేఎస్ జిల్లా కార్యదర్శి చుక్కయ్య హెచ్చరించారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) పిలుపు మేరకు రైతు సంఘాల ఆధ్వర్యంలో హనుమకొండలోని ఏకశిలా పార్క్ సెంటర్లో ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా హంసారెడ్డి, చుక్కయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఓట్లు, సీట్లు, అధికారమే ధ్యేయంగా మోసపూరిత హామీలతో పబ్బం గడపాలని చూస్తోందని విమర్శించారు. దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు యత్నిస్తూ దేశ ప్రజల నడుమ మత వైషమ్యాలను రెచ్చగొట్టి రాజ్యాంగాన్ని లౌకికత్వాన్ని మార్చే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఏడాదికిపైగా రైతులు ఢిల్లీ శివార్లలో ఉద్యమించిన ఫలితంగా మద్దతు ధర చట్టాన్ని చేస్తామని, రుణ విముక్తి కల్పిస్తామని, రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేస్తామని ఇచ్చిన హామీలన కేంద్ర ప్రభుత్వం అమలు చేయకుండా కాలయాపన చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతాంగ ఉద్యమ కాలంలో రైతులపై బనాయించిన కేసులను ఎత్తివేయకపోగా లకింపూర్ ఘటనలో రైతులపై వాహనాలను ఎక్కించి నలుగురి మరణానికి కారకుడైన కేంద్ర సహాయ మంత్రి ఆశిష్ మిశ్రాపై చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నాడు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరింత పెద్దఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమానికి ఏఐకేఎస్‌సీసీ జిల్లా కోకన్వీనర్ భాస్కర్ అధ్యక్షత వహించగా సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు వాసుదేవరెడ్డి, ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ సభ్యులు అజ్మీర వెంకన్న, దామర సుదర్శన్, ఏఐకేఎస్ జిల్లా నాయకులు శ్రీకాంత్, నరేష్, శేఖర్ గౌడ్, మొగిలి, తదితరులు పాల్గొన్నారు.