Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టరేట్ ఎదుట ధర్నా
నవతెలంగాణ-జనగామ
కేంద్ర బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేటర్లకు దోచి పెడుతుందని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి మోకు కనకారెడ్డి విమర్శించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్ ఎదుట కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం అధ్యక్షతన జరిగిన సభలో కనుకారెడ్డి పాల్గొని మాట్లాడారు. అనేక దశా బ్దాలుగా ప్రజలకు ఎంతో సేవలు అందించిన ప్రభుత్వ రంగ సంస్థలన్నీటిని, దేశ సహజ వనరులను బడా పెట్టుబడిదారులకు బీజేపీ ప్రభుత్వం కట్టబెడుతునదన్నారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు త్వరలో గుణపాఠం చెబుతారని అన్నారు. రైతు ఉద్యమం సందర్భంగా ప్రధాని మోడీ వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచాలని డిమాండ్ చేశారు. పట్టణాల్లో కూడా ఉపాధి హామీని అమలు చేసి పట్టణ పేదలకు ఉపాధి అవకాశాన్ని కల్పించాలన్నారు. వ్యవసాయ కూలీలకు కనీస వేతన చట్టం ప్రకారం కూలీ గిట్టుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని, కార్మికులు అనేక దశాబ్దాల పాటు పోరాడి సాధించుకున్న కార్మిక హక్కులను కాలారాసే కార్మిక కోడ్ బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 12 గంటల పని విధానాన్ని రద్దుచేసి ఎనిమిది గంటల పని విధానాన్నే కొనసాగించాలని కోరారు. పెరుగుతున్న నిత్యవ సరాల ధరలు తగ్గించడం కోసం ముఖ్యంగా వంట గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గించడం కోసం చర్యలు తీసుకోవాలని అన్నారు. సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న హామీని నెరవేర్చడంలో విఫలమైనందున కనీసం కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలనైనా భర్తీ చేసేందుకు పూనుకోవాలని హితవు పలికారు. విద్యారంగం ప్రైవేటీకర నను ఆపాలని, దళితులపై, ముస్లింలపై జరుగుతున్న దాడులను అరికట్టాలని డిమాండ్ చేశారు. అన్ని రంగాల్లో విఫలమైన బిజెపి ప్రభుత్వంపై ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతను దారిమల్లిం చేందుకే మతంను పావుగా వాడుకుంటున్నారని అన్నాఉ. ప్రజలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తతో ఉండాలని పిలుపునిచ్చారు. ప్రజల మధ్య ఐక్యతను, జాతీయ సమైక్యతను దెబ్బతీస్తున్న కేంద్ర బీజేపీ విధానాలను మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పే రోజు ఎంతో దూరంలో లేదని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అంద జేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా కార్యదర్శి బొట్ల శేఖర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్, రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి భూక్య చందు నాయక్, కెవిపిఎస్ జిల్లా అధ్యక్షులు తూటి దేవదానం, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు దడిగే సందీప్, జిల్లా నాయకులు చారి, వత్తి సంఘాల నాయకులు మైలారం వెంకటేశ్వర్లు, యాదగిరి, మాధవరెడ్డి, బిక్షపతి, మబ్బు ఉప్పలయ్య తదితరులతోపాటు వివిధ ప్రజాసంఘాల జిల్లా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.