Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మండల కేంద్రంలో వెలుగులోకి
నవతెలంగాణ-నరసింహులపేట
మహబూబాద్ జిల్లా కేంద్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఓ ఎంటర్ప్రైజెస్ పేరుతో కొంతమంది ఏజెంట్లుగా అవతారమెత్తి గ్రామీణ ప్రజలే లక్ష్యంగా మోసం చేస్తున్న సంఘటన మండల కేంద్రంలోని పడమటి గూడెం గ్రామంలో గత గురువారం వెలుగులోకి వచ్చింది. జిల్లా కేంద్రంలోని ఓ ఎంటర్ప్రైజెస్ ఏజెంట్లు చీటీల నమోదుకు పడమట గూడెం గ్రామానికి రావడంతో అప్రమత్తమైన గ్రామానికి చెందిన కొందరు యువకులు ఎంటర్ప్రైజెస్ ఏజెంట్లను నిలదీయడంతో అసలు విషయం బయట పడింది. మారుతి వ్యాగన్ కారు, మారుతి ఆల్టో కారు, బుల్లెట్ బైక్ ఆశ చూపుతో లక్కీ డ్రా పేరుతో రు.50 నుంచి రు.600 వరకు దశలవారీగా కట్టించాలనే లక్ష్యంతో 55,000 మంది సభ్యుల కోసం వల పన్ని కోట్ల రూపాయలను దండుకునేందుకు కుట్ర పన్నినట్టు సమాచారం. దసరా పండుగ సందర్భంగా సిల్వర్ జూబ్లీ జరుపుకుంటున్నట్లు లక్కీ డ్రా తీస్తున్నట్లు ఈ లక్కీ డ్రాలో సభ్యులు దశలవారీగా రూ.50 నుంచి 600 వరకు చెల్లిస్తే మొదటి వ్యక్తికి మారుతి వ్యాగన్ కారు, రెండవ వ్యక్తికి మారుతి ఆల్టో కారు, మూడవ వ్యక్తికి బుల్లెట్ బండి ఇలా చెబుతూ వాహనాన్ని మైక్ పెట్టి ప్రచారం చేస్తున్నారని గ్రామస్తులు తెలిపారు. కాగా లక్కీ డ్రా నిర్వాహకులు గ్రామంలో రాజకీయ పలుకుబడి ఉన్నవారు, ప్రజా ప్రతినిధులు కలిసిన వారు ఉన్నారని తెలసింది. ఈ లక్కీ డ్రాకు జిల్లా పోలీస్ అధికారుల నుంచి అనుమతి ఉన్నట్లు పేపర్ల చూపుతూ ప్రముఖ రాజకీయ నాయకులతో సదరు ఎంటర్ప్రైజెస్ ఓ ఏజెంట్ దిగిన ఫోటో ఆల్బమ్ చూపుతూ అమాయక ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై స్థానిక ఎస్సై మంగిలాల్ వివరణ కోరగా ఎలాంటి సమాచారం తమకు అందకలేదని తెలపడం గమనార్హం. జిల్లా అధికారులు అప్రమత్తమై ఎలాంటి అనుమతి లేకుండా చిట్టీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్న ఎంటర్ప్రైజెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.