Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జూలై నెల ఉత్పత్తి 51 శాతం, రవాణా 55 శాతం
- నెలవారీ సమీక్షలో వివరాలు వెల్లడి
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
జులైలో కురిసిన భారీ వర్షాల కారణంగా సింగరేణికి తీవ్ర నష్టం వాటిల్లిందని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ మల్లెల సుబ్బారావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన నెలవారీ సమీక్ష వివరాలను వెల్లడించారు. జూలైలో భూపాలపల్లి ఏరియా ఉత్పత్తి లక్ష్యం 2.75 లక్షల టన్నులు కాగా లక్షా 40 వేల 235 టన్నులతో 51 శాతం, రవాణా 55 శాతం, ఓపెన్ కాస్ట్ గనుల్లో మట్టి వెలికితీత (ఓబీ రిమూవల్) 42 శాతం మాత్రమే సాధించినట్టు తెలిపారు. వర్ష ప్రభావం భూగర్భ గనులపై పడకున్నా గైర్హాజర్ శాతం ఉత్పత్తికి విఘాతం కలిగిందని చెప్పారు. కేటీకే ఓసీ-2లో 685 మిల్లీమీటర్ల వర్షం పడటంతో 43 షిఫ్టులు, కేటీకే ఓసీ-3లో 677 మిల్లీమీటర్ల వర్షం పడటంతో 677 షిఫ్ట్‌ల ఉత్పత్తి నష్టపోయినట్టు తెలిపారు. గత ఏప్రిల్ నుంచి జూలై నెలల ప్రోగ్రెసివ్ ఉత్పత్తిలో 18 శాతం ప్రగతి సాధించినట్టు వివరించారు. 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఏరియా రూ.515 కోట్ల నష్టాల్లో నడవగా అందులో భూగర్భ గనుల ద్వారా రూ.494 కోట్లు, ఓసీల ద్వారా రూ.21 కోట్ల నష్టం వచ్చిందన్నారు. వర్షాలు తగ్గుముఖం పట్టగానే ఏరియా బొగ్గు ఉత్పత్తిలో ఎక్కువ భాగం విద్యుత్ ప్లాంట్లకు విద్యుత్ అంతరాయం కలగకుండా సరఫరా చేయాలని యాజమాన్యం ఆదేశాల మేరకు రవాణా చేస్తున్నట్టు తెలిపారు. భూపాలపల్లి ఏరియాలోని ఉన్న కేటీపీపీకి రవాణా చేస్తున్నామన్నారు. ఏరియాలో ఉద్యోగుల గైర్హాజరు శాతం ఇబ్బందిగా మారిందని చెప్పారు. జులైలో నూరు కంటే తక్కువ హాజరు శాతం కలిగిన 51 మందిని కౌన్సిలింగ్‌కు పిలువగా 8 మంది మాత్రమే హాజరయ్యారని ఆందోళన వెలిబుచ్చారు. ఏరియాలో కారుణ్య నియామకాల ద్వారా ఉన్నత చదువులు చదువుకున్న యువకులు ఎక్కువ మంది ఉద్యోగాలు పొందగా వారంతా బదిలీ వర్కర్‌గానే మిగిలిపోకుండా సంస్థ వేసే అన్ని ఉద్యోగ నోటిఫికేషన్లలో ఇంటర్నల్‌గా పోటీపడి ఉన్నత పదవులు అధిరోహించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఓ టు జీఎం విజయప్రసాద్, ఏజీఎం జోతి, పర్సనల్ మేనేజర్ అజ్మీర తుకారాం, ఫైనాన్స్ మేనేజర్ అనురాధ, సీనియర్ పీఓ శ్యామ్ ప్రసాద్, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ ఉత్తమ్ మాలిక్, తదితరులు పాల్గొన్నారు.