Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలి
- ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాహుల్ పాదయాత్ర
- కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణరావు
నవతెలంగాణ-శాయంపేట
కేంద్రంలోని బీజేపీ కార్పొరేట్ శక్తులకు అండగా నిలుస్తోందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు గండ్ర సత్యనారాయణరావు విమర్శించారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్‌ను ఆశీర్వదించాలని కోరారు. ప్రజావ్యతిరేక ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ రాహుల్ పాదయాత్ర చేపట్టారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, సింగరేణి, ఎల్‌ఐసీలతోపాటు 120 కార్మిక సంఘాలను ప్రైవేటుపరం చేస్తూ ఆదానీ, అంబానీ, తదితర కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తోందని చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రాహుల్ గాంధీ 3500 కిలోమీటర్లు, 150 రోజులు, 12 రాష్ట్రాల మీదుగా భారత్ జోడో పాదయాత్ర చేపడుతున్నారని, దానికి మద్దతుగా శనివారం మండలంలోని పత్తిపాక గ్రామం నుండి శాయంపేట వరకు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు సత్యనారాయణరావు పాదయాత్ర చేపట్టారు. ముందుగా పత్తి పాక గ్రామంలోని శ్రీ సంజీవ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి పాదయాత్ర ప్రారంభించారు. శాయంపేట గ్రామానికి చేరుకున్న పాదయాత్రలో భాగంగా చాకలి ఐలమ్మ, అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గండ్ర మాట్లాడుతూ 8 ఏళ్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పాలనలో ఎన్నికల వాగ్దానాలను ప్రభుత్వాలు తుంగలో తొక్కి రైతాంగం పై భారం వేయడమే కాక, ఎరువులు పై సబ్సిడీ ఎత్తివేసి, నిత్యవసర వస్తువులు, పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలు పెంచి పేదలపై భారం మోపుతోందని అన్నారు. సీఎం కేసీఆర్ ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ చేయలేదని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వం మనోధైర్యం అందించిన పాపాన పోలేదని మండిపడ్డారు. 140 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తే గెలిపిస్తే రైతులకు ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేల రైతుబంధు, ధరణి పోర్టల్‌ను ఎత్తి వేస్తామని, రైతు కూలీలకు వేయి చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఎరువులపై సబ్సిడీ అందజేస్తామని, పోడు భూములను పట్టాలు చేసి రైతులకు అప్పగిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ పార్టీకి మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు దూదిపాల బుచ్చిరెడ్డి, ఎంపిటిసి గజ్జి ఐలయ్య, నాయకులు కృష్ణమూర్తి, పోతు కష్ణమూర్తి, వైనాల కుమారస్వామి, చిందం రవి, నిమ్మల రమేష్, భిక్షపతి, రవీందర్, హైదర్, కుమారస్వామి, శ్రీను, రఫీ, రవిపాల్, రాజు, కట్టయ్య, సతీష్, చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.