Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏజీఎం కార్యాలయం ఎదుట ధర్నా
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారంలో సింగరేణి యాజమాన్యం మొండివైఖరి వీడాలని సింగరేని కాంట్రాక్టు కార్మికుగ సంఘాల జేఏసీ నాయకులు బంధు సాయిలు, కంపేటి రాజయ్య, మోటపలుకుల రమేష్, కుడుదుల వెంకటేష్ డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్టు కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా జిల్లా కేంద్రంలోని సింగరేణి ఏరియా జనరల్ మేనేజర్ (ఏజీఎం) కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏరియా పర్సనల్ మేనేజర్‌కు అందించారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు సాయిలు, రాజయ్య, రమేష్, వెంకటేష్ మాట్లాడారు. పది నెలలుగా కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై చర్చల పేరుతో యాజమాన్యం కాలయాపన చేస్తోందని విమర్శించారు. కోల్ ఇండియాలో చేసిన అగ్రిమెంట్ ప్రకారం హైపర్ కమిటీ వేతనాలు ఇవ్వాల్సి ఉండగా యాజమాన్యం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదని మండిపడ్డారు. కనీసం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం అమలు చేయడం లేదని ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా జీవో 22 గెజిట్ చేయకుండా కాంటాక్ట్ కార్మికులను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారన్నారని వివరించారు. కాంట్రాక్ట్ కార్మికుల కష్టంతో సంస్థకు లాభాలు వస్తున్నా లాభాల వాటా కింద నెల వేతనం కూడా అధికంగా ఇవ్వడం లేదన్నారు. గతంలో ముఖ్యమంత్రి సైతం కాంట్రాక్టు కార్మికులకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన నేపథ్యంలో దాని కొరకు కోల్ బెల్టు ప్రాంత ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడంలేదని, కాంట్రాక్టు కార్మికుల పై ఇంత చిన్న చూపు చూడడం ప్రజాప్రతినిధులకు సరికాదని,ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున రాష్ట్ర ప్రభుత్వమైనా చొరవ తీసుకొని యాజమాన్యానికి సమస్యల పరిష్కారం కొరకు సింగరేణికి ఆదేశాలు జారీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి సతీష్, సెగ్గెం రాజేష్, మధునమ్మ, లక్ష్మీ, సుధాకర్, స్వామి, నరేష్, సంపత్, మహేందర్, శ్రీనివాస్, శంకర్, తదితరులు పాల్గొన్నారు.