Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-భూపాలపల్లి
సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల నిరవధిక సమ్మెకు పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆయన ప్రకటించారు. హక్కులను సాధించే వరకు సమరశీలంగా పోరాడాలని సాయిలు పిలుపునిచ్చారు. సమ్మెలో పార్టీ ప్రత్యక్షంగా పాల్గొంటుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని శ్రామిక భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నాలుగు రోజులుగా సింగరేణి వ్యాప్తంగా కాంట్రాక్ట్ కార్మిక సంఘాల రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా జిల్లా కేంద్రంలో కాంట్రాక్ట్ కార్మికులు ఈనెల 9 నుండి నిరవాధిక సమ్మెలోకి వెళ్లారని చెప్పారు. వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి యాజమాన్యం, జేఏసీతో చర్చించాలని సూచించారు. 20 ఏండ్లుగా సింగరేణిలో పని చేస్తున్న కాంటాక్ట్ కార్మికులను యాజమాన్యం శ్రమదోపిడీకి గురి చేస్తోందని విమర్శించారు. కోల్ ఇండియా చట్టాలను కాకుండా ఆర్ అండ్ బీ చట్టాలను అమలు చేస్తూ కాంట్రాక్టు కార్మికులకు అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. పర్మినెంట్, కాంట్రాక్ట్ కార్మికులు కలిసి పని చేస్తేనే కంపెనీకి ఉత్పత్తి ఉత్పాదకత, లాభాలు వస్తున్నాయని చెప్పారు. లాభాల్లో కాంటాక్ట్ కార్మికులకు కనీస సౌకర్యాలు కల్పించకపోవడం దుర్మార్గమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులు న్యాయమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించాలని కోరారు. ప్రధానంగా కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణిలో ఖాళీగా ఉన్న క్వార్టర్లను కేటాయించాలని, సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, సింగరేణి ఏరియా ఆస్పత్రిలో కాంట్రాక్ట్ కార్మికుల కుటుంబాలకు కూడా ఇన్‌పేషంట్, ఔట్ పేషెంట్ వైద్య సౌకర్యం కల్పించాలని, ఓబీల్లో తరహాలో కాంట్రాక్ట్ కార్మికులకు 8 గంటల పని విధానం ఉండాలని, ప్లాస్టిక్ కార్మికులకు సెమీ స్కిల్డ్ వేతనాలు చెల్లించాలని, వోల్వో కార్మికులకు హైలీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలని, కన్వెన్షన్ డ్రైవర్లకు డీఏ రూ.500లు అదనపు పనికి ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు వెలిశెట్టి రాజయ్య, ఎండి చిన్న, రాజా పాల్గొన్నారు.