Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పొంగిపొర్లుతున్న చెరువులు, కుంటలు
- కూలిన ఇండ్లు.. నీటమునిగిన పంటలు
- నిలిచిన 12 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి
నవతెలంగాణ-మల్హర్రావు
బంగాళఖాతంలో ఏర్పడిన అల్పడనంతో మండలంలో మూడ్రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు జనజీవనం అతలాకుతలమైంది. రహదారులన్నీ జలదిగ్భందంలో కూరుకుపోయాయి. వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతుండడంతో పంట పొలాలు నీటమునిగాయి. ఇండ్లు, ఇండ్ల గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. మిడ్ మానేరు వద్ద 10 గేట్లు ఎత్తివేయడంతో మానేరు బ్యాక్‌వాటర్ ఉదతంగా ప్రవహిస్తుండడంతో మానేరు పరివాహక ప్రాంతాలైన తాడిచెర్ల, మల్లారం, పీవీ నగర్, డబ్బగట్టు, కుంభంపల్లి గ్రామాల్లోని వందలాది ఎకరాల పంటలు, విద్యుత్ మోటార్లు నీట మునిగాయి. తాడిచెర్ల ఓసీపీ బ్లాక్-1లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి 12 వేల మెట్రిక్ టన్నుల బొగ్గు ఉత్పత్తి, మట్టి వెలికితీత పనులు నిలిచిపోయినట్టు మైన్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి తెలిపారు. అటవీ గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయింది. ఆదివారం వర్షపాతం మండలంలో 106.6 నమోదైంది.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : మల్హర్రావు, ఎంపీపీ
మూడ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వరి, పత్తి పంటలు నీట మునిగిన, మానేరు ప్రాంతంలో కరెంట్ మోటార్లు కొట్టుకపోయి నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. వ్యవసాయ అధికారులతో సర్వేలు చేయించి ఎకరాకు రూ.25 వేలు నష్టపరిహారం అందేలా చూడాలి.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ప్రశాంత్, ఎస్సై, కొయ్యుర్
భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. జాలర్లు చేపల వేటకు వెళ్లొద్దు. పురాతన, శిథిలావస్థకు చేరిన ఇండ్లలో నివాసం ఉండొద్దు. పశువుల కాపర్లు మానేరు, నదుల ప్రవాహమున్న ప్రాంతాల వైపు వెళ్లొద్దు. కల్వర్టు, రోడ్డుపై నీటి ప్రవాహం ఉండగా దాటొద్దు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలి.
ఉప్పొంగిన మోరంచవాగు-నిలిచిపోయిన రాకపోకలు
గణపురం : మండలంలోని వెల్తుర్లపల్లి-అప్పయ్యపల్లి గ్రామాల మధ్యలో ఉన్న మోరంచవాగు ఉప్పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రెండ్రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మోరంచ వాగు ఉధతంగా ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాలు ప్రజలు రాకపోకలకు దూరమయ్యారు. మండలంలోని పలు చెరువులు, కుంటలు మత్తళ్లు పడుతున్నాయి. గనపసముద్రం చెరువు మత్తడి జోరుగా పడుతుంది.
కూలిన ఇల్లు
శాయంపేట : మండలంలో రెండ్రోజలుగా కురుస్తున్న వర్షాలకు కాట్రపల్లిలో గడ్డం రాజేశ్వర్‌కు చెందిన ఇల్లు పాక్షికంగా కూలిపోయింది. దీంతో ఇంట్లోని సామాగ్రి, నిత్యవసర వస్తువులు వర్షానికి తడిచాయి. స్థానిక సర్పంచ్ ఒంటేరు వనమ్మ వీరస్వామి, ఉప సర్పంచ్ అజ్మీర జారు ఆదివారం సందర్శించి వారి బంధువుల ఇంట్లో వసతి కల్పించారు. శిథిలావస్థకు చేరుకున్న ఇండ్లను పరిశీలించి తగిన జాగ్రత్తలు సూచించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇండ్లు కూలిపోయిన వారికి డబల్ బెడ్రూమ్ ఇండ్లు అందించి ఆదుకోవాలని కోరారు.