Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్ బెల్ట్
సింగరేణి కాంట్రాక్టు కార్మికులు గత నాలుగు రోజుల చేస్తున్న సమ్మెలో భాగంగా సోమవారం కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో భూపాలపల్లి తహసీల్దార్‌కు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం అందించారు. అనంతరం జేఏసీ నాయకులు కంపేటి రాజయ్య, కుడుదుల వెంకటేష్, కొండపాక సాంబయ్య, క్యాతరాజు సతీష్ మాట్లాడుతూ సింగరేణి వ్యాప్తంగా వివిధ విభాగా లలో సుమారు 25 వేల మంది, భూపాలపల్లి ఏరియా లో రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులు పని చేస్తున్నారన్నారు. బొగ్గు ఉత్పత్తి తద్వారా లాభాలలో భాగస్వాములు అయినప్పటికీ జీతాల విషయంలో యాజమాన్యం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదని , సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా గుర్తింపు సంఘం ఎన్నికలలో ఓటు హక్కు కల్పించాలని, ఖాళీ క్వార్టర్ లను కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మారేపల్లి మధనమ్మ, దొబ్బేటి లక్ష్మి, వెంకట లక్ష్మి, రమ సుధాకర్, స్వామి, సదానందం, సంపత్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.