Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తరగతి గదిలో ఖాళీ మద్యం బాటిల్స్, సిగరెట్లు
- సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి : ప్రజలు
నవతెలంగాణ-పెద్దవంగర
అది పేరుకు మాత్రం ప్రభుత్వ పాఠశాల.. కానీ అక్కడ జరిగేవన్నీ అసాంఘిక కార్యక్రమాలే... మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. ఇదీ మండల పరిధి పోచంపల్లి ప్రాథమికోన్నత పాఠశాల దుస్థితి. కొన్ని రోజులుగా పాఠశాలలో గుర్తు తెలియని వ్యక్తులు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తుండడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాలకు గేటు లేకపోవడంతో అపరిచితులు తరగతి గదిలో మద్యం సేవించి, తిను బండారాలు పడేసినట్లు మంగళవారం పాఠశాల ప్రధానో పాధ్యాయుడు గోనే రమేష్ తెలిపారు. పాఠశాల పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో ప్రజల్లో ఆందోళన నెలకొంటోంది. పాఠశాలలకు స్కావెంజర్లు లేకపోవడంతో ఉపాధ్యాయులే మద్యం సీసాలు మోయాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ప్రభుత్వ పాఠశాలలకు రాత్రివేళల్లో కాపలాదారులు, సీసీ కెమెరాలు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని స్థానిక ప్రజలు పేర్కొంటున్నారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే పాఠశాలకు రక్షణ కల్పించి, సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.