Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
1948 సెప్టెంబర్ 17న జరిగింది విమోచనమో,విలీనమో కాదని తెలంగాణ ప్రజలకు జరిగింది ముమ్మాటికి విద్రోహ దినమేనని న్యూడెమోక్రసీ మండల కార్యదర్శి జి సక్రు అన్నారు. స్థానిక న్యూడెమోక్రసి కార్యాలయంలో గురువారం జరిగిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలవనోళ్లు,పోరాటంతో సంబంధం లేనోళ్లు చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు. తెలంగాణ గెరిల్లా సాయుధ పోరాటం ద్వారా నిజాం నవాబు,రజాకార్ల ఆగడాలు, అకత్యాలకు వ్యతిరేకంగా భూమి,భుక్తి కోసం,వెట్టి చాకిరీ విముక్తి కోసం కమ్యూనిస్టుల నాయకత్వంలో ప్రజలు పోరాడి అనేక విజయాలు సాధించుకున్నారని అన్నారు. 4 వేల మంది అమరులై 3వేల గ్రామాలల్లో గ్రామ స్వరాజ్యాలను నిర్మించుకొని 10 లక్షల ఎకరాల భూములను ప్రజలకు పంచిపెట్టారని అన్నారు. నిజాం నవాబు దుర్మార్గాలకు వ్యతిరేకంగా కమ్మునిస్టుల నాయకత్వంలో ఆంధ్ర మహాసభ పిలుపు మేరకు ప్రజలు సాయుద దళాల్లో పని చేశారని అన్నారు. బీజేపీ రాజకీయ లబ్ధి కోసం విమోచన డ్రామా ఆడుతుందని,అధికార భయంతో కేసీఆర్ ప్రభుత్వం కూడా విమోచన పల్లవి పాడుతున్నారని ఎద్దేవా చేశారు. సప్టెంబర్ 17 న తెలంగాణ ప్రజలకు చీకటి రోజేనని ముమ్మాటికీ విద్రోహమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కె. నర్సన్న ,సిహెచ్. గణేష్, మనోహర్,ఎం మాన్య,ఎం వీరభద్రం,బి మంగీలాల్,సక్రు తదితరులు పాల్గొన్నారు.