Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిజామ్ దురాగతాలకు సజీవ సాక్షిగా ఆర్లగుట్ట
నవతెలంగాణ-భీమదేవరపల్లి
ఒకే బుల్లెట్‌తో 8 మంది ప్రాణాలు తీసిన రజాకార్ల దురాగతానికి మండలంలోని ఆర్లగుట్ట పెద్ద గుండు సజీవ సాక్షి. హుజురాబాద్ పాత తాలూకా పరిధిలోని గ్రామాల్లో నిజామ్ హయాంలో రజాకార్లు సాగించిన దురాగతాలను స్థానికులు నేటికీ మరువడం లేదు. నిజామ్ నిరంకుశ పాలనను చవిచూసిన ఎవరిని కదిలించినా రజాకార్ల అరాచకాలను కండ్లకు కట్టినట్లు చెబుతున్న పరిస్థితి ఉంది. మండలంలోని ముల్కనూర్ గ్రామ శివారులోని నరహరి తండా సమీపంలోని ఆర్లగుట్ట వద్ద రజాకార్లు నాడు ఓకే బుల్లెట్‌తో ఎనిమిది మందిని కాల్చి చంపారు. భూపతి రామన్న భవనంపై మాటు వేసిన రజాకార్ల సీఐడీ అధికారిని కమ్యూనిస్టులు చంపడంతో ప్రతీకారంగా రజాకార్లు ఆర్లగడ్డ సమీపంలో పశువులను మేపుతున్న 8 మందిని పట్టుకుని ఒకే వరసలో నిలబెట్టి ఓకే బుల్లెట్‌తో కాల్చి చంపారు. ఆ కాల్పుల్లో ముల్కనూర్‌కు చెందిన కూన రోశయ్య, ఎర్రబెల్లికి చెందిన లంబాడి నాగ్యా, వంజరి వెంకటయ్య, ముత్తారానికి చెందిన మేక కొమురయ్య, రేణిగుంట్ల వెంకటయ్య, ఇతర గ్రామాలకు చెందిన సిద్ధ రాజయ్య, పోడూరి వెంకటయ్య చనిపోయారు. మరుసటి రోజున కొత్తకొండ శివారులో కమ్మరి రామచంద్రం, దేవానందంలను కాల్చి చంపారు. నిజామ్ అరాచకాలకు అడ్డుకట్ట వేసేందుకు నాడు ముల్కనూర్‌కు చెందిన స్వాతంత్ర సమరయోధులు పడాల రాజమౌళి, పడాల చంద్రయ్య, భోజపురి వెంకటయ్య, అలిగిరెడ్డి సంజీవరెడ్డి, కాస్తగోని పెద్ద రాజీరు, పెంటపూర్తి మోహన్‌రెడ్డి, రావుల దామోదర్ మల్లారంలో సమావేశమై భారత ప్రభుత్వ యూనియన్ జెండాను ఎగరేయగా నిజామ్ జాగీర్దార్ దస్తగిరి ఆధ్వర్యంలో రజాకార్లు సమావేశ ప్రాంతానికి చేరుకొని ఇష్టారీతిన కాల్పులు నిర్వహించగా కమ్యూనిస్టులు తప్పించుకోగా మల్లారానికి చెందిన పుట్ట వీరయ్య ప్రాణాలొదిలాడు. రజాకార్ల దురాగతాలను ఎదుర్కొనేందుకు నాడు బడిసెలు, రాళ్లు, గొడ్డళ్లు చేత పట్టుకుని ప్రజలు తిరగాల్సిన దుస్థితి నేటికీ మండల ప్రజలకు గుర్తే. నిజామ్ రజాకార్ల దురాగతాలకు ఎదురొడ్డి పోరాడిన నాటి కమ్యూనిస్టుల, స్వాతంత్ర సమరయోధుల చరిత్రను పాఠ్యాశాల్లో చేర్చి భవిష్యత్ తరాలకు అందించాలని మండల ప్రజలు పాలకులను కోరుతున్నారు.