Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు తెలంగాణ విలీన దినోత్సవం
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో 1946-48 వరకు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగింది. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తెలంగాణ ప్రాంతానికి రాలేదు. 7వ నిజాం ఉస్మాన్ అలీఖాన్ నియంతృత్వం, ఖాసీం రజ్వీ అండదండలతో రజాకార్లు, దేశ్‌ముఖ్‌లు, భూస్వాములు తెలంగాణ ప్రాంతంలో పేదలపై దాడులు చేయడమే కాకుండా దోచుకున్నారు. మహిళలపై అత్యాచారాలు చేయడం, భూములను లాక్కోవడం, పంటలను దోపిడి చేయడమే కాకుండా తీవ్ర హింసలకు గురి చేశారు. ఈ క్రమంలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో తెలంగాణలో గ్రామ రక్షక దళాలు ఏర్పడి నిజాం సైన్యం, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడారు. షేక్ బందగీ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య ఇలా ఎంతో మంది ధీరులు ఈ పోరాటంలో కీలకపాత్ర పోషించారు. ఎంతో మంది రజాకార్ల తూటాలకు బలయ్యారు. భారత సైన్యం 'ఆపరేషన్ పోలో'తో నిజాం సెప్టెంబర్ 17న సాయంత్రం భారత ప్రభుత్వానికి లొంగిపోతున్నట్లు ప్రకటించి హైద్రాబాద్ సంస్థానాన్ని భారత యూనియన్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. నాటి నుండి సెప్టెంబర్ 17న తెలంగాణ విలీన దినోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా మారింది. నాటి పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ నేతృత్వంలో 3 వేల గ్రామాల్లో గ్రామ రక్షణ దళాలు ఏర్పడ్డాయి. 10 లక్షల ఎకరాల భూములను పేదలకు పంచారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ఎర్రజెండా నీడన జరిగితే బిజెపి సెప్టెంబర్ 17ను విమోచన దినంగా చేయాలని ప్రచారం చేస్తుండడం చర్చనీయాంశంగా మారింది. సాయుధ పోరాటంలో బిజెపికి ఎలాంటి పాత్ర లేకపోయిన ఈ చారిత్రాత్మక పోరాటాన్ని హిందు, ముస్లిం పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం వివాదాస్పదంగా మారింది. నియంత నిజాంకు సర్ధార్ వల్లభారు పటేల్ 'రాజ్‌ప్రముఖ్' బిరుదునివ్వడమే కాకుండా హైద్రాబాద్ గవర్నర్ హౌదానివ్వడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు.. నిజాం, రజాకార్ల నేత ఖాసీం రజ్వీని రాచమర్యాదలతో నాటి భారత ప్రభుత్వం పాకిస్తాన్‌కు పంపడం విమర్శలకు తావిచ్చింది. ఈ క్రమంలో ఈనెల 17న తెలంగాణ విలీన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని సిపిఐ (ఎం) పిలుపునిచ్చింది.
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఉమ్మడి వరంగల్ జిల్లా కీలక పాత్ర పోషించింది. నేటి జనగామ, వరంగల్, హన్మకొండ జిల్లాలతోపాటు సిద్దిపేట జిల్లాలో దూల్మిట్ట మండలంలో ఎన్నో మహత్తర ఘట్టాలు ఈ పోరాటానికి నేటికీ సాక్షిభూతంగా నిలిచాయి. కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో నిజాం నియంతృత్వం, రజాకార్లు, దేశ్‌ముఖ్‌ల దమనకాండకు వ్యతిరేకంగా పాలకుర్తి చాకలి ఐలమ్మ వీరత్వం, షేక్ బందగీ అమరత్వం, దొడ్డి కొమురయ్య ధీరత్వం స్ఫూర్తితో తెలంగాణ పల్లెలు ఉద్యమించాయి. తెలంగాణ విముక్తి కోసం భైరాన్‌పల్లి, కూటిగల్, లింగాపూర్, దూల్మిట్ట తదితర గ్రామాల్లో రజాకార్లకు వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున పోరాటం చేశారు. మద్దూరు, లద్నూర్, సలాఖ్‌పూర్, రేబర్తి, మర్మాముల గ్రామాలను రజాకార్లు తమ స్థావరాలుగా చేసుకొని దాడులు చేస్తుండేవారు. భైరాన్‌పల్లి కేంద్రంగా చుట్టు పక్కల గ్రామదళాలు రజాకార్లపై ఎదురుదాడికి దిగాయి. హన్మకొండ జిల్లా పరకాల పట్టణంలో 1947 సెప్టెంబర్ 2న జరిగిన సంఘటనను మరో జలియన్‌వాలా బాగ్ పరకాలగా పేర్కొంటారు. పరకాల పట్టణంలో జాతీయ పతాకాన్ని ఎత్తడానికి సుమారు 1,500 మంది పరకాల, రేగొండ, చిట్యాల, మొగుళ్లపలి, భూపాలపల్లి ప్రాంతాల నుండి పరకాలకు తరలివచ్చారు. ఈ క్రమంలో నిజాం సైన్యం, రజాకార్లు ముందస్తూ వ్యూహంతో ఒకే ద్వారమున్న ప్రాంగణానికి ప్రజలు చేరుకున్నాక ఆ ద్వారానికి అడ్డంగా వుండి కాల్పులు జరపడంతో 22 మంది మృతిచెందారు. 150 మంది గాయపడ్డారు. ఈ సంఘటన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మైలురాయిగా పేర్కొంటారు.
భైరాన్‌పల్లి రక్త చరిత్ర
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక పాత్ర పోషించిన భైరాన్‌పల్లి ప్రస్తుతం సిద్దిపేట జిల్లా దూల్మిట్ట మండలంలో వుంది. 1948 ఆగస్టు 27వ తేదీన అర్ధరాత్రి ఖాసీం రజ్వీ నేతృత్వంలో రజాకార్లు జనగామ నుండి 10 ట్రక్కులలో బయలుదేరి రాత్రి 2.00 గంటలకు లద్నూర్ గ్రామానికి చేరుకున్నారు. తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో భైరాన్‌పల్లి గ్రామాన్ని 12 వందల మంది సైన్యంతో దిగ్బంధించారు. బహిర్భూమికి వెళ్లిన ఉల్లెంగుల నర్సయ్యను పట్టుకొని గ్రామంలోని బురుజు దారి చూపించమని తీసుకెళ్లారు. గ్రామంలోకి వెళ్లగానే నర్సయ్య రజాకార్లను తోసివేసి రజాకార్లు గ్రామంలోకి వచ్చారని కేకలు వేశారు. దీంతో బురుజుపైనున్న వారు నగార మోగించారు. దీంతో రజాకార్లు కాల్పులు ప్రారంభించారు. కాల్పులు జరుగుతుండగా నిప్పు రవ్వలు పడి బురుజుపై వున్న మందుగుండు సామాగ్రి పేలి బురుజు పైభాగం కూలింది. దీంతో రజాకార్లు గ్రామంలోకి చొరబడి దొరికిన వారిని దొరికినట్లు కాల్చి చంపారు. ఒక్కరోజే బైరాన్‌పల్లిలో 96 మందిని చంపి శవాల చుట్టు మహిళలతో బతుకమ్మ ఆట ఆడించారు.
షేక్ బందగీ అమరత్వం..
జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కామారెడ్డిగూడెం గ్రామంలో షేక్ బందగీ 4 ఎకరాల భూమిపై తన పాలివాడు ఫకీర్ అహ్మద్ కన్నేశాడు. ఫకీర్ విస్నూర్ దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డికి అనుచరుడు. ఫకీర్ రామచంద్రారెడ్డి అండదండలతో షేక్ బందగీ భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేసేవాడు. రామచంద్రారెడ్డి గూండాలు షేక్ బందగీపై ఆ భూమిని ఫకీర్‌కు ఇచ్చేయ్యాలని ఒత్తిడి చేసేవాడు. ఈ క్రమంలో షేక్ బందగీ తన భూమి కబ్జా ప్రయత్నంపై జనగామ తాలూక కోర్టునాశ్రయించాడు. 1941, జూలై 17న జనగామ తాలూక కోర్టు తీర్పునివ్వనుండగా, తీర్పు రానుందని ముందే గమనించిన రామంచంద్రారెడ్డి గూండాలు షేక్ బందగీ జనగామ నుండి కామారెడ్డిగూడెం గ్రామంలోకి చేరుకొని ఇంటికి వెళ్తుండగా, దారి కాచి గొడ్డళ్లు, కత్తులతో నరికి చంపారు.
చాకలి ఐలమ్మ వీరత్వం..
పాలకుర్తి చాకలి ఐలమ్మ వీరత్వం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో కీలక ములుపు. విస్నూరు దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి 60 ఊళ్లకు దొర. 60 గ్రామాల్లో చట్టం ఆయనకు చుట్టం. ఆయన ఏదీ చెబితే అదే న్యాయం. ఆయన అరాచకాలు అన్నీ, ఇన్నీ కావు. ప్రజలను పెద్ద ఎత్తున దోచుకున్నాడు. చాకలి ఐలమ్మ 4 ఎకరాల భూమిని కౌలు చేసుకొని పంట పండిస్తే ఆ పంటను దోచుకునే ప్రయత్నం చేశాడు. దీన్ని ఐలమ్మ ధైర్యంగా ఎదిరించింది. దీంతో ఆగ్రహించిన రామచంద్రారెడ్డి ఐలమ్మ భర్తపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించాడు. ఐలమ్మపై దాడులకు పాల్పడడంతో ఐలమ్మ తిరుగబడింది. ఐలమ్మ స్ఫూర్తితో మహిళలు పెద్ద ఎత్తున సాయుధ పోరాటంలో మమేకమయ్యారు.
దొడ్డి కొమురయ్య ధీరత్వం..
జనగామ జిల్లా కడవెండి గ్రామంలో ప్రజలంతా ఏకమై కర్రలు, బడిసెలు, గునపాలు అందుకొని విస్నూరు దొర రామచంద్రారెడ్డి గూండాలను, రజాకార్లను తరిమికొట్టారు. విస్నూరు దొర రామచంద్రారెడ్డి భార్య దొరసాని జానకమ్మ చేసే అకృత్యాలు అన్నీ, ఇన్నీ కావు. పేదలను పీడించి వడ్డీలు వసూలు చేసేది. ఈ క్రమంలో కడవెండి గ్రామానికి చెందిన దొడ్డి మల్లయ్య అనేక సందర్భాల్లో దొరసానితో తగవు పడ్డాడు. ఈ విషయంలో మల్లయ్య తమ్ముడు కొమురయ్య అన్నకు అండగా వున్నాడు. దీంతో మల్లయ్య కుటుంబంపై దొరసాని కక్ష పెంచుకుంది. ఈ క్రమంలో 1946 జూలై 4వ తేదీన కమ్యూనిస్టులపై దాడులు చేయాలని భావించి మస్కీన్ అలీ ఆధ్వర్యంలో 40 మంది గూండాలు గ్రామంలో ప్రజలను రెచ్చకొట్టేలా దూషించడం, రాళ్లు రువ్వడం ప్రారంభించారు. దీంతో గ్రామంలో రామచంద్రారెడ్డి నేతృత్వంలో 200 మంది కార్యకర్తలు రజాకార్లకు వ్యతిరేకంగా ప్రదర్శన చేపట్టారు. దొరసాని గడీకి ఎదురుగా వున్న పాఠశాల భవనంలో మిస్కిన్ అలీ నాయకత్వంలో మకాం వేసి వున్న దేశ్‌ముఖ్ ప్రైవేటు రక్షణ దళం ర్యాలీగా వస్తున్న కార్యకర్తలపై ఎలాంటి హెచ్చరికలు చేయకుండా కాల్పులు జరిపింది. ఇందులో ముందు వరుసలో వున్న దొడ్డి కొమురయ్య కాల్పుల్లో అమరుడయ్యాడు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో దొడ్డి కొమురయ్య తొలి అమరుడు. దీంతో గ్రామాల్లో పోరాటం పతాకస్థాయికి చేరింది.