Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రబడి మాడిపోతున్న పత్తి మొక్కలు
- పెట్టుబడి రావడం గగనమే
- పరిహారం చెల్లించి ఆదుకోవాలి : రైతులు
నవతెలంగాణ-శాయంపేట
పత్తి సాగుకు అప్పులు తెచ్చి, ఆరుగాలం శ్రమించి పంట సాగు చేయగా, పకతి వైపరీత్యాలతో ఈ ఏడాది కురిసిన భారీ వర్షాలకు నీరు జాలువారి పత్తి మొక్కలు ఎర్రబడి మాడిపోయి చనిపోతున్నాయి. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి రావడం గగనమే అని రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో సర్వే చేపట్టి వర్షాలతో పంట నష్టపోయిన రైతాంగానికి పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో ఈ ఏడాది 7964 ఎకరాలు పత్తి పంట సాగు చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో భూగర్భ జలాలు పెరిగి పంట క్షేత్రాలలో నీరు జాలువారి పత్తి మొక్కలు ఎర్రబడి చనిపోతున్నాయి. దసరా పండుగకు ముందే మొదటి క్రాఫ్ చేతికి వచ్చేదని, ఎకరాకు మూడు క్వింటాళ్ల దిగుబడి వచ్చిన ప్రభుత్వ గిట్టుబాటు ధర ప్రకారం 20,000 చేతికి వచ్చేదని, ప్రైవేట్ ఆడ్తి వ్యాపారుల వద్ద విక్రయించిన 30,000 వచ్చేదని రైతులకు తెలపడం గమనార్హం. భారీ వర్షాలతో పంట పూర్తిగా చనిపోయిందని, పెట్టుబడి కూడా రావడం గగనమేనని, పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించి ఆదుకోవాలని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఎకరాకు 50 వేల పరిహారం అందించాలి
గాజే రాజేందర్, రైతు, శాయంపేట
ఈ ఏడాది పత్తి పంట సాగు చేయగా ఎకరాకు రూ. 25 వేలు పెట్టుబడి అయింది. పంట ఏపుగా ఎదిగిన, ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట క్షేత్రంలో నీళ్లు జాలువారి పత్తి మొక్కలు చనిపోయాయి. పంటకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. రెవెన్యూ, వ్యవసాయ అధికారులతో క్షేత్రస్థాయిలో పత్తి పంటపై సర్వే చేపట్టి నష్టపోయిన రైతాంగానికి ఎకరాకు 50 వేల పరిహారం చెల్లించి ఆదుకోవాలి.
కాపర్ ఆక్సిక్లోరైడ్ ద్రావణాన్ని పత్తి వేర్ల వద్ద
పోయాలి : కే గంగా జమున, ఏఓ శాయంపేట
భారీ వర్షాలతో పత్తి వేరు వ్యవస్థకు సరైన ఆక్సిజన్ అందక మొక్కలు వాడిపోతున్నాయి. లీటర్ నీటిలో మూడు గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ ద్రావణాన్ని పత్తి వేర్ల వద్ద పోసినట్లయితే మొక్కలు బతికే అవకాశాలు ఉన్నాయి. మూడు రోజుల తర్వాత 19-19-19 10 గ్రాముల ద్రావణాన్ని ఒక లీటర్ నీటిలో కలిపి మొక్కపై స్ప్రే చేయాలి. ఇప్పటికే మండల పరిధిలోని గ్రామాలలో వ్యవసాయ విస్తరణ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి, పత్తి రైతులకు పంట కాపాడుకోవడానికి సలహాలు, సూచనలు అందజేస్తున్నాం. ఎప్పటికప్పుడు పత్తి పంట నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తున్నాం.