Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్షేమ పథకాల అమలులో ముందంజ
- ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి
నవతెలంగాణ-భూపాలపల్లి
దేశానికి తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న అభివద్ధి సంక్షేమ పథకాలు దిక్సూ చిగా నిలుస్తున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో అందరికీ అందుబాటులో వైద్యసేవలు అందుతున్నాయని, సంక్షేమ పథకాల అమలులో జిల్లా ముందంజలో ఉందని, నియోజకవర్గంలో కొత్తగా పదివేల మందికి ఆసరా అందిస్తున్నట్టు ఆయన వివరించారు. జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్ చౌరస్తా నుంచి అంబేడ్కర్ స్టేడియం వరకు శుక్రవారం నిర్వహించిన జాతీయ సమైక్యతా ర్యాలీని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, కలెక్టర్ భవేశ్ మిశ్రా, పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణితో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి మాట్లాడారు. చారిత్రాత్మకంగా అత్యంత ప్రాధాన్యం కలిగిన రోజుగా సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తోందని తెలిపారు. భారతదేశానికి స్వాతంత్య్రం లభించిన తరువాత హైదరాబాద్, జోద్పూర్, మైసూర్, జమ్మూ కాశ్మీర్ మొదలైన 565 ప్రాంతాలను దేశంలో విలీనం చేస్తారని చెప్పారు. అత్యధికంగా హిందువులు నివసిస్తు ముస్లిం రాజుగా ఉండే హైదరాబాద్ రాష్ట్రం పోలిస్ యాక్షన్ అనంతరం 17 సెప్టెంబర్ 1948న ప్రజాస్వామ్య బద్ధ భారతదేశంలో విలీనమైందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు పూర్వ కాలం నుంచి చైతన్యంతో ప్రజావ్యతిరేక ప్రభుత్వాలపై వీరోచిత పోరాటం చేశారని, 2వ జలియాన్ వాలా బాగ్ గా పరకా ప్రాంతానికి పేరు వచ్చిందని, పోరాటంలో 22 మంది తమ ప్రాణాలను సైతం త్యాగం చేశారని ఎమ్మెల్యే గుర్తు చేశారు. హైదరాబాద్ రాష్ట్రం ప్రజాస్వామ్య బద్ద భారతదేశంలో విలీనమై 75 సంవత్సరాలవుతున్న దష్ట్యా సీఎం కేసీఆర్ ఆదేశాలతో 3 రోజులపాటు ఘనంగా సంబరాలు జరుపుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. 1 నవంబర్ 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు దష్ట్యా ఆంధ్రాలో తెలంగాణ విలీనమైందని, అనంతరం సీఎం కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాల మలిదశ ఉద్యమం తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశానికి తెలంగాణ రాష్ట్రంలో అందుతున్న పాలన ఆదర్శంగా నిలిచిందని, మిషన్ భగీరథ, రైతుబంధు, మిషన్ కాకతీయ వంటి పథకాలను ఇతర రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఆదర్శంగా తీసుకుందని తెలిపారు. తెలంగాణ జనాభా దేశంలో 2.5 శాతం ఉన్నప్పటికీ దేశ జీడీపీలో 5 శాతం మన రాష్ట్రం ద్వారా వస్తుందని, దేశాన్ని సాకుతున్న రాష్ట్రాలలో తెలంగాణ ముందువరుసలో ఉందని ఆయన అన్నారు. నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాగునీరు, విద్యుత్, సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలిచామని కాళేశ్వరం ఎత్తిపోతల పథకాన్ని రికార్డు సమయంలో పూర్తి చేశామని వివరించారు. వ్యవసాయం దండుగ అన్న ప్రాంతంలో వ్యవసాయాన్ని పండుగ చేసిన నాయకుడు సీఎం కేసీఆర్ అని, రైతులకు 24 గంటల పాటు నాణ్యమైన ఉచిత విద్యుత్, ఎకరానికి రూ 10వేల రైతు బంధు సాయం, రైతు భీమా, మద్దతు ధర పై ధాన్యం కొనుగోలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ మాత్రమేనని ఎమ్మెల్యే అన్నారు. వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ మాట్లాడుతూ హైదరాబాద్ రాష్ట్రం ప్రజాస్వామ్యం భారత దేశంలో విలీనం అయి 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ 3 రోజులపాటు వేడుకలు నిర్వహిస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా మాట్లాడుతూ ఆగస్టు 8 నుంచి ఆగస్టు 22 వరకు స్వాతంత్య్ర వజ్రోత్సవాలు నిర్వహించామని, దేశానికి స్వాతంత్రం లభించిన తరువాత రాజుల పాలనలో ఉన్న హైదరాబాద్, మైసూర్, జోద్పూర్ మొదలైన ప్రాంతాలు తర్వాత సమయంలో దేశంలో విలీనమయ్యాయని తెలిపారు. 17 సెప్టెంబర్ 1948న హైదరాబాద్ రాష్ట్రం ప్రజాస్వామ్యం వద్ద భారతదేశంలో విలీనమై 75 సంవత్సరాలవుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా 3 రోజులపాటు వేడుకలు నిర్వహిస్తుందని కలెక్టర్ పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ దివాకర, జిల్లా ఎస్పీ సురేందర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ శ్రీనివాసులు, జెడ్పి సీఈవో శోభారాణి, వరంగల్ రూరల్ జిల్లా పరిషత్ చైర్మన్ గండ్ర జ్యోతి, భూపాలపల్లి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కళ్లెప శోభ, మున్సిపల్ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, ఆయా శాఖల జిల్లా అధికారులు, జిల్లాలోని జడ్పిటిసిలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, భూపాలపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.