Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీ, ఆర్ఎస్ఎస్ కుట్రలను తిప్పికొట్టాలి
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు
నవతెలంగాణ-రేగొండ
కమ్యూనిస్టులే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బందు సాయిలు స్పష్టం చేశారు. మండలంలోని కనపర్తి గ్రామంలో జిల్లా నాయకుడు గుర్రం దేవేందర్ అధ్యక్షతన ఆదివారం నిర్వహించిన పార్టీ రాజకీయ శిక్షణ తరగతులకు సాయిలు హాజరై మాట్లాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం 1946 నుంచి 1951 వరకు ఆంధ్ర మహాసభ నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీలు ఐదేండ్లపాటు సమరశీలంగా సాయుధ పోరాటం సాగించాయని చెప్పారు. నిజామ్ దేశ్ముఖ్, విస్నూరు రాంచంద్రారెడ్డిలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్మించిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీల పొంతమన్నారు. ఆ పోరాటంలో అమరులైన దొడ్డి కొమురయ్య, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, పుచ్చలపల్లి సుందరయ్య, భీమిరెడ్డి నర్సింహారెడ్డి, చాకలి ఐలమ్మ, తదితర అనేక మంది కమ్యూనిస్టు నేతలు భాగస్వాములై ప్రజలకు అండగా నిలిచారని గుర్తు చేశారు. కమ్యూనిస్టులు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, 3 వేల గ్రామాలకు విముక్తి కల్పించారని తెలిపారు. నిజామ్ సర్కారు రజాకార్లతో ప్రజలపై దాడులు చేయించగా కమ్యూనిస్టులు ప్రతిఘటించి ప్రజలకు రక్షణగా నిలిచారని చెప్పారు. నాటి పోరాటంలో లేని బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మోసపూరిత ప్రచారం చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. బీజేపీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని హిందూ-ముస్లిముల మధ్య గొడవగా ప్రచారం చేసే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బూర్జువా పాలకుల మోసపూరిత విధానాలను ప్రజలు గుర్తించాలని సూచించారు. ప్రజలకు అండగా నిలిచేది కమ్యూనిస్టులు మాత్రమేనని తేటతెల్లం చేశారు. పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు దామెర కిరణ్ 'వర్తమాన రాజకీయాలు' అంశంపై బోధించారు. కులం, మతం మీద జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పొలం రాజేందర్ బోధించారు. కార్యక్రమంలో నాయకులు రవి, మామిడి కమలాకర్, దొడ్డ రాములు, పరశురాములు, శ్రీనివాస్, ప్రశాంత్, సాంబయ్య, మౌన, మంజుల, మైసయ్య, తదితరులు పాల్గొన్నారు.