Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్
నవతెలంగాణ-పాలకుర్తి
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్య్ర పోరాటం, భూమి, భుక్తి, వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన తెలంగాణ పోరాటంలో బీజేపీ నాయకులు ఎక్కడున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశ్నించారు. గిరిజనుల అభివద్ధితోపాటు, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్మించిన సద్గురు సేవాలాల్ మహారాజ్ గిరిజన భవన్, కొమరం భీమ్ గిరిజన భవన్ ప్రారంభోత్సవం కార్యక్రమంలో గిరిజనబంధు తో పాటు, గిరిజనుల రిజర్వేషన్ 10 శాతానికి పెంచుతున్న ప్రకటించడం పట్ల ఆదివారం మండల కేంద్రంలోని రాజీవ్ చౌరస్తాలో సీఎం చిత్రపటానికి మంత్రి ఎర్రబెల్లితో కలిసి ప్రజాప్రతి నిధులు, గిరిజన నాయకులు, పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ నేడు బీజేపీ నాయకులు రాజకీయ లబ్ధికోసం కుట్రలు చేస్తూ విమోచన దినోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదమన్నారు. గిరిజనుల రిజర్వేషన్ పెంచాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని, రిజర్వేషన్ పెంపు పై కేంద్రం కాలయాపన చేస్తూ మోసం చేస్తున్న దన్నారు. గిరిజనులకు రాజ్యాధికారంతో పాటు, చట్టసభల్లో ప్రాధాన్యత కల్పించాలనే, లక్ష్యంతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో 3146 గిరిజన తండాలను, గిరిజన గూడాలను గ్రామపంచాయతీలుగా చేశా మని తెలిపారు.
గిరిజన గూడాలుగా ఏర్పడిన గ్రామపంచాయతీలకు సొంత భవనాల నిర్మాణానికి త్వరలో నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటం తో పాటు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం, తెలంగాణ సాధన పోరాటంలో కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పార్టీ పోరాటం చేసిందన్నారు. ఎలాంటి పోరాటం చేయని బీజేపీ విమోచన దినోత్సవం జరిపే అర్హత లేదని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ నల్ల నాగిరెడ్డి, జెడ్పి ఫ్లోర్ లీడర్ శ్రీనివాస రావు, జిల్లా కోఆప్షన్ సభ్యులు ఎండి మదర్, ఐలమ్మ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, రైతుబంధు సమితి జిల్లా డైరెక్టర్ జరుకుల బాలు నాయక్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ వీరమనేని యాకాంతరావు, సద్గురు సేవాలాల్ మహారాజ్ ఆలయ నిర్మాణ కమిటీ నియోజకవర్గ అధ్యక్షుడు డాక్టర్ భూక్య రవి రాథోడ్, టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, టిఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు పాము శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ గుగులోతు పార్వతిదేవానాయక్, టీఆర్ఎస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు ధారావత్ యాకూబ్, టిఆర్ఎస్ అధికార ప్రతినిధి లావుడియా మల్లు నాయక్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లావుడియా దేవా నాయక్, ఎంపీటీసీ గుగులోతు వసంత జిమ్మీలాల్, గిరిజన నాయకులు పాల్గొన్నారు.