Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పక్కదారి పడుతున్న పౌష్టికాహారం
- కేంద్రాలకు అరకొరకగా బాలల హాజరు
నవతెలంగాణ-శాయంపేట
తల్లులకు, గర్భిణులకు, కిషోర బాలికలకు, ఐదేండ్లలోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందజేస్తుండగా అధికారుల పర్యవేక్షణ కొరవడిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సిబ్బంది పౌష్టికారాన్ని పక్కదారి పట్టిస్తున్నట్టు తెలుస్తోంది. పరకాల ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని శాయంపేట మండలంలోని 24 గ్రామ పంచాయతీల్లో 58 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తుండగా 55 మంది అంగన్వాడీ టీచర్లు, 51 మంది అంగన్వాడీ హెల్పర్లు విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ముగ్గురు అంగన్వాడీ టీచర్లు, ఏడుగురు హెల్పర్ల పోస్టులను భర్తీ చేయాల్సి ఉంది. 7 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా, 47 కేంద్రాలు పాఠశాల్లో కొనసాగుతున్నాయి. నాలుగు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఐదేండ్లలోపు పిల్లలకు అంగన్వాడీ టీచర్లు ఆటపాటలతో కూడిన విద్యను అందజేస్తున్నారు.
తల్లులకు, పిల్లలకు రేషన్
అంగన్వాడీ కేంద్రాల ద్వారా పాలిచ్చే తల్లులకు, గర్భిణులకు ప్రతిరోజు ఉడకబెట్టిన గుడ్డు, 200 మిల్లీలీటర్ల పాలు, ఆకుకూర, సాంబార్‌తో కూడిన తయారు చేసిన భోజనాన్ని అందించాల్సి ఉంది. ఆరు నెలల నుంచి మూడేండ్లలోపు పిల్లలకు నెలకు 16 కోడిగుడ్లు, బాలామతాన్ని రేషన్‌గా అందజేయాల్సి ఉంటుంది. మూడేళ్ల నుంచి ఐదేండ్లలోపు పిల్లలకు ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తూ ప్రతిరోజు ఉడకబెట్టిన కోడిగుడ్డు, భోజనం అందజేయాల్సి ఉంటుంది. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల సంఖ్య రిజిస్టర్లలో ఎక్కువ నమోదు చేస్తున్న, కేంద్రాలకు మాత్రం ముగ్గురు నుండి పది లోపు పిల్లలు మాత్రమే హాజరవుతున్నారు.
అధికారుల పర్యవేక్షణ కరువు
మండలంలో శాయంపేట, పత్తిపాక రెండు సెక్టార్లు ఉండగా సెక్టార్‌కు ఒకరు చొప్పున ఇద్దరు సూపర్వైజర్లు 58 అంగన్వాడి కేంద్రాలను తనిఖీ చేస్తూ తల్లులకు, గర్భిణులకు, కిశోర బాలికలకు, ఐదేండ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం అందజేసేలా పర్యవేక్షించాల్సి ఉంది. ప్రస్తుతం ఒక్కో సూపర్వైజర్ రెండు సెక్టార్లను పర్యవేక్షిస్తుండడంతో అన్ని కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడుతోందని తెలుస్తోంది. దీంతో అంగన్వాడీ సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తూ పౌష్టికాహారాన్ని పక్కదారి పట్టిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఏది ఏమైనా పౌష్టికాహార లోపం లేకుండా ఉండడానికి ఏర్పాటు చేసిన అంగన్వాడి కేంద్రాలపై అధికారులు నిత్యం పర్యవేక్షిస్తూ పౌష్టికారం పక్కదారి పట్టకుండా చూడాలని, పౌష్టికాహారం అందరికీ అందేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.