Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే చల్లాపై ఇనుగాల మండిపాటు
నవతెలంగాణ-ఆత్మకూర్
ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన అనుచరులు అధికార దాహంతో రైతుల భూములు లాక్కుంటున్నారని కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఇనుగాల వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. మండలంలోని గూడెప్పాడు గ్రామానికి చెందిన కోట్ల రైతు కరుణాకర్‌రెడ్డికి చెందిన పట్టా భూమిని ఇంజక్షన్ ఆర్డర్ ఉన్నా కూడా రాత్రికి రాత్రే శ్రీనివాస క్రషర్ యాజమాన్యం రోడ్డు వేయడాన్ని నిరసిస్తూ సదరు భూమిని ఇనుగాల ఆదివారం పరిశీలించి మాట్లాడారు. కొత్తగట్టు గ్రామ పరిధిలో ఉన్న 'చల్లా ఇన్ఫ్రా' కేవలం తన శ్రీనివాస స్టోన్ క్రషర్‌లోకి వెళ్లేందుకే రోడ్డు కోసం రైతు అనుమతి లేకుండా భూమిని కబ్జా చేసి, ఎస్సారెస్పీ కెనాల్‌ను ధ్వంసం చేసి రైతులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. వెంటనే దీనిపై ప్రభుత్వ అధికారులు స్పందించి రైతుకు న్యాయం చేసి అనుమతులు లేకుండా నడుస్తున్న క్రషర్లను మూసివేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి భూకబ్జాలు, సామాన్య ప్రజలపై దౌర్జన్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకు ఎమ్మెల్యే చల్లా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. రానున్నది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు బీరం రజనీకర్‌రెడ్డి, కమలాపురం రమేష్, ఉపసర్పంచ్ వీసం శ్రీనివాస్‌రెడ్డి, చౌళ్లపల్లి సర్పంచ్ కంచ రవికుమార్, పీఏసీఎస్ వైస్ చైర్మెన్ జనగాం ప్రభాకర్, లోకలబోయిన దేవేందర్, మాజీ సర్పంచ్‌లు బండి శ్రీనివాస్, బండి సాంబయ్య, కందికొండ రఘుపతి, వార్డు సభ్యుడు ఓరుగంటి కరుణాకర్‌రెడ్డి, యూత్ నాయకుడు ఓరుగంటి మహిపాల్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.