Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చుట్టూ మురుగే..!
- మౌలిక వసతులు కరువు
- పట్టించుకోని అధికారులు, పాలకులు
- గాడి తప్పిన తాడిచెర్ల గిరిజన సంక్షేమ బాలుర వసతి గృహం
- ఇబ్బదుల్లో విద్యార్థులు
నవతెలంగాణ-మల్హర్రావు
ఆర్థిక భారంతో ఇంట్లో పిల్లల్ని చదివించుకోలేక పేద కుటుంబాలు తమ పిల్లల్ని సంక్షేమ వసతి గహాల్లో చేర్పించి పాఠశాలలకు పంపిస్తున్నారు.బిడ్డలు దూరంగా ఉన్న ప్రభుత్వం కల్పించే మంచి వసతితోపాటు నాణ్యమైన బోజనం తిని ప్రయోజకులు అవుతారని భావిస్తున్న తల్లిదండ్రులు హాస్టల్లో చేర్పిస్తున్నారు.ప్రభుత్వం విద్యార్థులకు అవసరమైన మెస్ చార్జీలు,మౌలిక వసతుల కల్పనకు నిధులు ఇస్తున్నా అరకొర సౌకర్యాల మధ్యనే విద్యార్థులు బస చేయాల్సిన దుస్థితి మండల కేంద్రమైన తాడిచెర్లలోని (సోషల్ వెల్పేర్) గిరిజన సంక్షేమ ప్రభుత్వ ఆశ్రమ వసతి గహంలో నెలకొంది.బుధవారం నవ తెలంగాణ సందర్శనలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి.
చుట్టూ మురుగే....
తాడిచెర్ల గిరిజన సంక్షేమ వసతి గహం చుట్టూ మురుగు నీటితో కంపు వేదజల్లుతోంది.వసతి గహం వెనకాల, ప్రధాన గెట్ వద్ద,ముందువైపు మురికి నీటి నిల్వలు, చెత్తా, చెదారంతో నిండిపోవడంతో దోమలు,ఈగలు రాజ్యమేలుతున్నాయి.పడక గదుల్లో అపరిశుభ్రత,గహం గోడలకు భారీగా కన్నాలైయ్యాయి దీంతో రాత్రింబవళ్లు విష పురుగులు సరచరించే అవకాశం ఉంది.పిల్లలు ఆడుకునే రంగుల రాట్నం మురికి నీటితో నిండిపోయింది.
మౌలిక వసతులు కరువు...
వసతి గృహంలో మొత్తం 100 మంది విద్యార్థులు ఉండాలి కానీ 83 మంది అదికూడా అధికారుల రికార్డుల్లో మాత్రమే కనిపించడం గమనార్హం.విద్యార్థులకు మౌలిక వసతులు కరువైయ్యాయి. తాగునీటి కోసం ఏర్పాటు చేసిన ఆర్వో ప్లాంట్ మూడేండ్లుగా చెడిపోయి మూలన చేరింది. మరుగుదొడ్లకు నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తరగతి గదుల్లో అపరిశుభ్రత, రాత్రి వేళల్లో విద్యార్థులు కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, ప్రభుత్వం అందించే నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంట గదిలో మురిగిపోయిన మూడు రకాల కురగాయలు దర్శనమిస్తున్నాయి.
వార్డెన్, సిబ్బంది గైహాజరు...
వసతి గృహంలో ఉంటూ విద్యార్థుల సంక్షేమాన్నీ చూడాల్సిన వార్డెన్, వంట నిర్వాహకుడు, కుక్ కీపర్,వాచ్ మెన్ తదితర సిబ్బంది ఉన్నా.వీరు చుట్టం చూపులా వస్తూ విధులకు డుమ్మా కొడుతున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.స్థానికంగా ఉండాలనే ప్రభుత్వ నిబంధనలను గాలికొదిలేశారు.వసతి గహంపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో వారు ఇస్తారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
విద్య బోధన అంతంత మాత్రమే...
3 నుంచి 7వ తరగతి వరకు వసతి గహంలోనే విద్య బోధన నిర్వహించడానికి గిరిజన ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాల ఏర్పాటు చేశారు.ఇందుకు విద్యార్థులకు బోధించడానికి ఏడుగురు ఉపాధ్యాయులు ఉన్నారు.ఇందులో ఒక తెలుగు పండిట్ ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, మిగతా ఆరుగురు కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఉన్నారు.వీరు పిల్లలకు విద్య బోధన చేస్తున్నట్లుగా అంతంత మాత్రమే కనిపించింది. 8,9,10 తరగతి విద్యార్థులు ప్రక్కనున్న ప్రభుత్వ జిల్లాపరిషత్ పాఠశాలలో విద్యనభ్యసిస్తున్నారు.
అధికారుల,పాలకుల పర్యవేక్షణ కరువు...
మండల కేంద్రములో వసతి గహం ఎక్కడో లేదు. మండల పరిషత్ కార్యాలయం, ప్రభుత్వ జూనియర్ కళాశాల, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘము కార్యాలయం, ఆరోగ్య కేంద్రము మధ్యలో ఉంది.అయిన ఏనాడు అధికారులు, పాలకులు వసతి గహంలో విద్యార్థుల పరిస్థితిపై పర్యవేక్షణ చేయకపోవడంపై పలువురు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు.వసతి గహంలో మెనూ ప్రకారం భోజనాలు అందుతున్నాయా.? నిర్వహణ ఎలా ఉంది.?మౌలిక వసతులు కల్పిస్తున్నారా.? అని ఆరా తీసేవారు కరువైయ్యారు. వసతి గహాలపై పర్యవేక్షణ చేయాల్సిన సంబంధించిన జిల్లా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడకపోగా గాలికొదిలేశారు. దీంతో వసతి గృహం గాడి తప్పింది.
వసతి గృహాన్ని గాలికొదిలేశారు : ఎ శ్రీకాంత్, డివైఏప్ఐ జిల్లా కార్యదర్శి
తాడిచెర్లలో ఉన్న గిరిజన ఆశ్రమ వసతి గహాన్ని ఉన్నతాధికారులు గాలికొదిలేశారు. డీడీలు, డివిజన్ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంతో విద్యార్థులచే బాత్రూమ్లు కడిగిస్తు మెనూ ప్రకారం భోజనం పెట్టకుండా వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. సంక్షేమ శాఖకు చైర్మన్ అయిన కలెక్టర్,స్థానిక అధికారులు,పాలకులు సందర్షించడంతోపాటు, సంక్షేమ అధికారుల్లో నిర్లక్ష్యం పెరిగింది.
వసతులు ఏర్పాటు చేయిస్తాం : దేశీరామ్, ఏటీడీఓ, ఐటీడీఏ
తాడిచెర్ల వసతి గహంలో మినరల్ ఆర్వో ప్లాంట్ చెడిపోయిన విషయం తెలియదు. తక్షణమే మరమ్మతులు చేయిస్తాము. అలాగే వసతి గహంలో మౌలిక వసతులు, పరిశుభ్రతపై పర్యవేక్షణ చేసి చర్యలు చేపడుతాము.