Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అండగా రాష్ట్ర ప్రభుత్వం
- టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే అరూరి రమేష్
నవతెలంగాణ-హనుమకొండ చౌరస్తా
మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని టీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ ఆకాంక్షించారు. ఆ దిశగా మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. భీమారంలో ఆదివారం నిర్వహించిన మహిళా పరస్పర సహాయ సహకార పొదుపు, పరపతి సంఘం 4వ వార్షిక మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా అభివద్ధి సాధించేలా రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు అందిస్తోందని చెప్పారు. ప్రభుత్వం అందిస్తున్న వడ్డీ లేని రుణాలు, పావలా వడ్డీ రుణాలను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు మండల మహిళా సమాఖ్య భవనాలు, అన్ని గ్రామాల్లో మహిళా భవనాలు నిర్మిస్తున్నట్లు తెలిపారు. మహిళా పారిశ్రమిక వేత్తలకు ప్రభుత్వం అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలను శాశ్వత కొనుగోలు కేంద్రాలుగా అభివద్ధి చేసి మహిళల ద్వారా అన్ని రకాల పంటల కొనుగోళ్లు చేపట్టేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోందని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జక్కుల రజిత శ్రీనివాస్, ప్రాజెక్టు మేనేజర్ రవీందర్రావు, మెప్మా సీఓ రమేష్, తదితరులు పాల్గొన్నారు.