Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరా నగర్ కాలనీ అభివృద్ధికి రూ.20లక్షలు
- మహిళల్ని అభివృద్ధి పథంలో నడపడమే సీఎం కేసీఆర్ లక్ష్యం
- మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి
- శ్రీపతిపల్లి సర్పంచ్ ప్రత్యూషామనోజ్ రెడ్డికి ఘన సన్మానం
నవతెలంగాణ-స్టేషన్‌ఘన్‌పూర్
దేశంలోని రాష్ట్రాల కంటే ఎక్కువగా ప్రజాసంక్షేమ పథకాలు అమలవుతున్న రాష్ట్రం, అందిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ ఉపముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి అన్నారు. సోమవారం స్టేషన్‌ఘన్‌పూర్ ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్న ప్రజల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సంభందిత అధికారులతో మాట్లాడారు. ఇండ్లపై విద్యుత్ తీగలు, జనావాసాల మధ్య ట్రాన్స్ ఫార్మర్ తొలగింపు, ప్రభుత్వ పాఠశాల వరకు సీసీ రోడ్డు, మహిళా సంఘ భవనం ఏర్పాటుకు సహకారం అందిస్తానని అన్నారు. ప్రస్తుతం రూ.20లక్షల పనులకు హామీనిచ్చారు. అనంతరం చిల్పూర్ మండలం శ్రీపతిపల్లి సర్పంచ్ కేశిరెడ్డి ప్రత్యుషామనోజ్ రెడ్డి ఇటీవల లక్నోలో జరిగిన స్మార్ట్ విలేజ్ పంచాయతీ ఎంపవర్మెంట్ రూరల్ కమ్యూనిటీస్ జాతీయ సదస్సుకు జిల్లా నుంచి ఎంపికపట్ల ఆ గ్రామంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కడియం పాల్గొని మాట్లాడుతూ... దేశంలో ఎక్కడా లేని విధంగా మహిళా అభివద్ధి పథంలో నడిపేందుకు కేసీఆర్ లక్ష్యంగా పనిచేస్తున్నారని అన్నారు. గ్రామ సంక్షేమమే ధ్యేయంగా భావించి పనిచేస్తున్న సర్పంచ్ దంపతులను అభినందించారు. డిజిటల్ లైబ్రరీ, మహిళా భవనం ప్రహరీ నిర్మాణానికి తనవంతు సహాయం అందిస్తానని తెలిపారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 2022-23 గానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.2లక్షల 56వేల కోట్లు బడ్జెట్ ప్రకటిస్తే, ఇందులో రూ.90కోట్లు సంక్షేమానికి కేటాయించిందన్నారు. 36లక్షల ఆసరా పించన్లకు అదనంగా 10లక్షల మందికి పింఛన్లు ఇవ్వడమే గాక, సాంకేతిక, ఇతర కారణాలతో రాని పెన్షన్లను అందించేందుకు సీఎం అంగీకరించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 23 లక్షల రైతుబంధుతో కలిపి, రూ.58 వేల కోట్లు రైతు సంక్షేమానికి, రూ.14 వేల కోట్లు ఆసరా పెన్షన్లకు, మరో రూ.14వేల కోట్లు, దళితబంధుకు ఈ ఏడాది రూ.17, 700 కోట్లు, కల్యాణలక్ష్మి, రైతు బీమా, కేసీఆర్ కిట్టు, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, హాస్టళ్ల సంక్షేమానికి వేల కోట్లు ఖర్చు పెడుతున్నదన్నారు. సెప్టెంబర్ 17న తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు ఘనంగా జరిపామని, ఆదివాసీ, బంజారా ఆత్మగౌరవ సభలో సీఎం రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ తెగల కోసం పలు సంక్షేమ పథకాలు ప్రకటించగా, కేంద్ర ప్రభుత్వం స్పందించకుండా, రాష్ట్ర శాసనసభ తీర్మానాన్ని తొక్కిపట్టి, సమాధానమివ్వకుండా, రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవచ్చనే సూచన కూడా చేయలేదని అన్నారు. సీఎం కేసీఆర్ షెడ్యూల్ తెగల రిజర్వేషన్ తీర్మానాన్ని ప్రకటించడం హర్షనీయన్నారు. సమగ్ర సర్వే ఆధారంగా గిరిజనులకు 6శాతమున్న రిజర్వేషన్ 10 శాతానికి పెంచడం, అటవీ ప్రాంతంలో గిరిజనులు జీవిస్తున్నారని, గిరిజన బంధు అమలు చేస్తామని సీఎం ప్రకటనతో, ప్రతిపక్ష పార్టీలకు ఏం మాట్లాడాలో తెలియక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. ఆదిలాబాద్ లో బీజేపీ ఎంపీ సోయం బాబురావు గిరిజన, ఆదివాసి బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆందోళన చేస్తుంటే, బీజేపీలో ఉంటూ బండి సంజరు, కిషన్ రెడ్డి సోయంకు మద్దతుగా ఉంటారా..? లేక చర్యలు తీసుకుంటారా ? అని ప్రశ్నించారు. బ్రోకర్ మాటలు మానుకుని సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన చట్ట ప్రకారం రెండు రాష్ట్రాల్లో గిరిజన విశ్వవిద్యాలయం కేటాయింపు ఉండగా, ఆంధ్రాలో ఇచ్చి, రాష్ట్రంలో ములుగు వద్ధ ఏర్పాటు చేయాలని స్థలాన్ని చూపిన ఎనిమిదేండ్లుగా లేనిపోని చవట మాటలు మాట్లాడుతున్నారని అన్నారు. దేశంలోనే ఎక్కడా లేని పథకాలు అందిస్తూ, రోల్ మోడల్ గా సీఎం కేసీఆర్ పాలన అందిస్తుంటే ప్రతిపక్షాలకు కళ్లు కనబతలేవా అని మండిపడ్డారు. పచ్చని రాష్ట్రంలో కుల,మత విద్వేషాలు రెచ్చగొడుతూ రాజకీయ చలిమంటలు కాగుతూ పబ్బం గడుపుతున్నారని అన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీజేపోల్లు దళిత, గిరిజన, మైనార్టీ వ్యతిరేకులు అని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ ఎడవెళ్ళి క్రిష్ణా రెడ్డి, రైస్ మిల్లర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా నాయకులు బెలిదే వెంకన్న, మారుజోడు రాంబాబు, మధుసూధన్ రెడ్డి, ఇల్లందుల సుదర్శన్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు పోగుల సారంగపాణి, మామిడాల లింగారెడ్డి, సర్పంచులు రాజ్ కుమార్, రఘుపతి, రుప్లా నాయక్, రవీందర్, లోడెం రజిత రవీందర్, మనెమ్మ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.