Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధు
నవతెలంగాణ-మహాదేవ్‌పూర్
అధికారులు పని చేయకపోతే తనకేంటన్న ధోరణిలో మంథనిలో ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే నిర్వాకం ఉన్న క్రమంలో ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రజలే బుద్ది చెప్పాలని టీఆర్ఎస్ పార్టీ మంథని అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యుడు, పెద్దపల్లి జెడ్పీ చైర్మెన్ పుట్ట మధుకర్ కోరారు. మండలంలోని మేడిగడ్డ, సూరారం, బెగ్లూర్, బొమ్మాపూర్, బ్రాహ్మణపల్లి, కుదురుపల్లి, ఎడ్లపల్లి, తదితర గోదావరి ముంపు గ్రామాల్లో టీఆర్ఎస్ జిల్లా నాయకుడు జక్కు రాకేష్‌తో కలిసి సోమవారం పర్యటించారు. ముంపునకు గురైన చేన్లు, తెగిన గట్లు, గోదావరి బ్యాక్ వాటర్ తీవ్రతను పరిశీలించారు. పరిహారంపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుట్ట మధూకర్ మాట్లాడారు. అధికారుల అలసత్వాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేలా చూస్తామన్నారు. ప్రతిపక్ష పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు ఏం చేయగలను అన్నట్లు ఉండటమే తప్ప ఎమ్మెల్యే ప్రజల గురించి ఏనాడూ ఆలోచించలేదని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్ భూనిర్వాసితుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పనులు చేయాల్సి ఉండగా పట్టించుకోవడం లేదన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, రైతులు, కూలీలు ఇబ్బంది పడుతుంటే ఎమ్మెల్యే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు సైతం పట్టించుకోవడం లేదన్నారు. సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కార దిశగా చొరవ తీసుకుంటానని చెప్పారు. సమావేశంలో టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు, ఎంపీపీ రాణిబాయి, సర్పంచ్‌లు శ్రీపతి బాపు, లచ్చిరెడ్డి, పీఏసీఎస్ చైర్మెన్ చల్ల తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మంథని నియోజకవర్గ మహిళా ఇన్‌ఛార్జి గీతబాయి, మండల మహిళా అధ్యక్షురాలు స్వప్న, కాటారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ భవాని ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గోల్కొండ కిరణ్, ఎంపీటీసీ రెవెల్లి మమత నాగరాజు, సీనియర్ నాయకులు చల్ల ఓదెలు యాదవ్, నాయకులు కూరతోట శ్రీహరి, మాధవరావు, తదితరులు పాల్గొన్నారు.