Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మట్టెవాడ
ఆటో డ్రైవర్లను కార్మికులుగా గుర్తించి ఆటో రంగానికి వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్(సీఐటీయూ) 9వ జిల్లా మహాసభలు చారుబౌలీలోని నోబెల్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో మూడు సంవత్సరాల కార్యక్రమాల ఫలితాలను ప్రవేశ పెట్టిన అనంతరం జిల్లా నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. నూతన కార్యవర్గం ఆటో ట్రాలీ డ్రైవర్ల సంక్షేమం కోసం పాటుపడాలని అన్నారు. వేలాది మంది ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తున్నారని అన్నారు. నగరంలో ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ సమస్యలతో సతమతమవుతున్నారని ఆటో అడ్డాల సమస్యలు పరిష్కరించాలన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆటో రంగాన్ని అన్ని విధాలుగా నష్టం చేసిందని డీజిల్, పెట్రోలు ధరలు పెంచి ఆటో ట్రాలీలపై ఆధారపడి జీవించే కార్మికుల నడ్డి విరిచిందని మండిపడ్డారు. ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్‌పై అధికారుల వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కనీస వేతనం అమలు చేయడం లేదని పని గంటలను పెంచి అదనపు శ్రమ దోపిడీ చేస్తున్నాయని మండిపడ్డారు. కార్మిక హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమించే సమయం ఆసన్నమైందని, అందరూ సిద్ధం కావాలని పిలుపు నిచ్చారు. అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులుగా ఎంఎస్ సలాం, ప్రధాన కార్యదర్శిగా ఎండి మహబూబ్ పాషాతోపాటు ఎస్కె మదర్,ఎండీ మున్నా బోన గాని నగేష్, సతీష్, బరిగల సుబ్బు భూక్యరాజు, ఎండి బాబా, ఎండి గౌస్, తాళ్లపల్లి నవీన్, గణేష్, నాగరాజు, వంగరి రవీందర్‌ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు ఇనుముల శ్రీనివాస్, జిల్లా సహాయ కార్యదర్శి అక్కినపల్లి యాదగిరి పాల్గొన్నారు.