Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మొగుళ్లపల్లి
మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో సీఎస్ఐ మిషనరీ ఆధ్వర్యంలో ఏర్పాటై ప్రజలకు అందిస్తున్న హోమియో వైద్య సేవలు అభినందనీయమని సర్పంచ్ మోటె ధర్మారావు, ఎంపీటీసీ వనిత పున్నంచందర్రావు తెలిపారు. ఐదు నెలలుగా హోమియో వైద్యశాలలో వైద్యులు లేక సేవలు నిలిచిపోగా మంగళవారం కొత్తగా డాక్టర్ బాబు, సీఎస్ఐ మిషనరీ ఫాదర్ జస్ మాథ్యూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హోమియో వైద్యశాల పునఃప్రారంభానికి ముఖ్యఅతిథులుగా సర్పంచ్, ఎంపీటీసీ హాజరై మాట్లాడారు. 15 ఏండ్లుగా సీఎస్ఐ హోమియో వైద్యశాల డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించారని చెప్పారు. వైద్య సదుపాయాలు లేక చుట్టూ ఉన్న గ్రామాల్లో అనేక మంది పాముకాటుతో, అనారోగ్యంతో మరణించారని తెలిపారు. అలాంటి వారి కోసం మండల కేంద్రంలో హోమియో వైద్యశాల నెలకొల్పి ప్రాణదాతగా నిలిచిందన్నారు. ఐదు నెలలుగా వైద్యుడు లేక వైద్య సేవలు నిలిచిపోవడంతో పాముకాటుకు గురైన ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు తెలిపారు. నూతనంగా వచ్చిన డాక్టర్ ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ మల్సాని నర్సింగరావు, ముత్తిలింగాచారి, రాఘవరెడ్డి, ఫాదర్లు స్వామి, స్వర్ణాకర్, తదితరులు పాల్గొన్నారు.