Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్
నవతెలంగాణ-ములుగు
అటవీ, రెవెన్యూ, పోలీస్ శాఖలు సమన్వయంతో పని చేస్తూ జిల్లాలో అటవీ సంపదను పరిరక్షించాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశుసంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ కోరారు. అర్హులైన పోడు రైతులకు పట్టాలు అందించి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సత్వరమే చర్యలు చేపట్టాలని ఆమె ఆదేశించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్, జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీఓ అంకిత్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ జి పాటిల్, డీఎఫ్ఓ లావణ్యలతో కలిసి మంగళవారం నిర్వహించిన పోడు భూముల జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశానికి మంత్రి సత్యవతి రాథోడ్ హాజరై మాట్లాడారు. రాష్ట్రంలో ఎక్కువ అడవులున్న జిల్లాగా ములుగు గుర్తింపు పొందిందని చెప్పారు. జిల్లాలోని తాడ్వాయి మండలం లోని లింగాల, బంధాల గ్రామాల్లో పోడు భూముల సమస్య ఎక్కు వగా ఉందన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ నివేదికను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం జీఓ విడుదల చేసిందని చెప్పారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు సంబంధిత శాఖలు సమన్వయంతో త్వరితగతిన చర్యలు తీసు కోవాలని అధికారులను ఆదేశించారు. చట్టం అమల్లోకి వచ్చిన అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులకు పట్టాలిస్తా రని, జిల్లాకు సంబంధించి 91 వేల 843 ఎకరాలకు గాను 34 వేల 44 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వాటిని క్షేత్ర స్థాయిలో టెక్నికల్ సిబ్బంది సర్వే చేయాలని చెప్పారు. అలాగే అటవీ సంపదను కాపాడేలా, భవిష్యత్తులో ఆక్రమణకు గురి కాకుండా సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. జెడ్పీ చైర్మెన్ కుసుమ జగదీష్ మాట్లాడుతూ త్వరలో నిర్ధారణ కమిటీ రిపోర్ట్ ప్రకారం పోడు రైతులకు పట్టాలు జారీ చేసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి మాట్లాడుతూ పోడు రైతుల సమస్యలు పరిష్కరించా లని, పోడు రైతులకు గతంలో పట్టాలు జారీ చేసిన వారికి బోర్లు వేసుకోవడానికి ఫారెస్ట్ అధికారులు అనుమతి ఇవ్వాలని, పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునేలా ట్రాక్టర్లు వెళ్లేందుకు అనుమతించాలని కోరారు. జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు మంత్రి సారథ్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి కమిటీలో ఎంపీ, ఎమ్మెల్యే, జెడ్పీ చైర్మెన్, ఎస్పీ, జిల్లా అటవీశాఖ అధికారి, ఐటీడీఏ పీఓ సభ్యులుగా ఉంటారని, జిల్లా కలెక్టర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ గణేష్, డీఆర్వో రమాదేవి, డివిజినల్ ఫారెస్ట్ అధికారి బాజీరావు పటేల్, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం
జిల్లా కేంద్రంలో రూ.20 లక్షలతో పునర్మిర్మించిన గాంధీ పార్క్ కమ్యూనిటీ భవనాన్ని సర్పంచ్ బండారి నిర్మల హరినాధం, జెడ్పీ చైర్మన్ జగదీశ్వర్, జిల్లా కలెక్టర్ కష్ణ ఆదిత్య, ఐటీడీఏ పీవో అంకిత్‌లతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. తొలుత గాంధీ విగ్రహానికి ఆమె పూలమాల వేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని బండారుపల్లి వెళ్లే దారిలో రూ.70 లక్షల వ్యయంతో నిర్మించిన జిల్లా సహకార అధికారి కార్యాలయాన్ని, మొదటి అంతస్తులోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో కుటుంబ నియంత్రణ తాత్కాలిక పద్ధతులు నోటి మాత్రలు, ఐయుడి ఇంట్రా యుటరిన్ డివైస్, అంతర ఇంజక్షన్లు ఇవి తాత్కాలిక పద్ధతులు, కుటుంబ నియంత్రణ శాశ్వత పద్ధతులు స్త్రీలకు ట్యూ బెక్టమీ పురుషులకు వ్యాసక్తమి ఎన్ఎస్వి ఆపరేషన్లకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను ప్రారంభించారు. అలాగే రూ.20 లక్షల నిధులతో డీఎంహెచ్ఓ, ములుగు ఏరియా ఆసుపత్రి ఔషధ గిడ్డంగిని ప్రారంభించారు. బండారుపల్లి శివారులో రూ.2.65 కోట్లతో చేపట్టిన గ్రీన్ ఫీల్డ్ స్టేడియం నిర్మాణం పనుల శంకుస్థాపన చేశారు. కార్యక్రమాల్లో జెడ్పీ వైస్ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, జెడ్పీటీసీ సకినాల భవాని, ఎంపీపీ గండ్రకోట శ్రీదేవి, బండారుపల్లి సర్పంచ్ అక్కల రఘోత్తమ్, తదితరులు పాల్గొన్నారు.