Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-గార్ల
నిరుపేద రైతులు సాగుచేసుకుంటున్న భూములు లాక్కుని వారి పొట్టకొట్టవద్దని ఏఐకేఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జడ. సత్యనారాయణ అన్నారు. మండలంలోని మద్దివంచ గ్రామంలో రైతుల భూములు అటవీ శాఖ అధికారులు లాక్కోవద్దని న్యూడెమోక్రసీ పార్టీ అధ్వర్యంలో తహసీల్దార్ కార్యాలయం ముందు మంగళవారం అందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మద్ధి వంచ గ్రామంలో 116 వ సర్వే నెంబరు లో ఉన్న భూమిని 50 మంది పేద రైతులు, గిరిజనులు శతాబ్దం క్రితం నుండి 25 ఎకరాలు భూమిని సేద్యం చేస్తున్నారని అన్నారు. ఈ భూమిలో ఫారెస్ట్ అధికారులు మొక్కలు నాటడానికి సర్వే చేస్తున్నారని, ఈ భూములను ఆక్రమించడం దారుణమన్నారు. ఆ భూములకు సంబంధించి కొంతమంది గిరిజనులకు పట్టాలు కూడా ఉన్నాయని అన్నారు. మండలంలో రాంపురం, పుల్లూరు, శేరిపురం గ్రామాలలో ప్రభుత్వ భూములు దొరల చేతుల్లో కబ్జాలో ఉన్నాయని ఇలాంటి భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోకుండా పేదలు భూములు గుంజుకోవడం అన్యాయం అన్నారు. అనంతరం తహసీల్ధార్ రాముకు వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో గౌని భద్రయ్య, సర్పంచ్ కుసిని బాబురావు, గౌని మల్లేష్, బావ్ సింగ్, శ్రీరాములు, రవి, అప్పయ్య, మహేష్, రాంబాబు,సాగు రైతులు తదితరులు పాల్గొన్నారు.