Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్ ఉషాదయాకర్‌రావు
నవతెలంగాణ-పాలకుర్తి
చదువుకు పేదరికం అడ్డు కాదని, విద్యలో బాలికలు దూసుకుపోయినప్పుడే ఉపాధ్యాయులకు, దాతలకు, ప్రోత్సాహకులకు సార్ధకత ఉంటుందని ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్పర్సన్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సతీమణి ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల బాలికల పాఠశాలలో మహాత్మా హెల్పింగ్ హాండ్స్ వ్యవస్థాపకులు గంట రవీందర్ ఆధ్వర్యంలో జిల్లాలోని 12 కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలల్లో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రతిభ కనబరిచిన 42 మంది విద్యార్థినిలను ఘనంగా సన్మానించి, నగదు ప్రోత్సకాలు అందజేశారు. బతుకమ్మ ఉత్సవాల సందర్భంగా ఏర్పాటుచేసిన బతుకమ్మ వద్ద జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం పాఠశాల స్పెషల్ అధికారి బైరపాక నవీన అధ్యక్షతన జరిగిన సమావేశంలో కస్తూర్బా గాంధీ బాలికల గురుకుల పాఠశాలల, కళాశాలల జిల్లా అధికారిని గౌసియా, ఎంపీపీ నల్ల నాగిరెడ్డితో కలిసి ఉష దయాకర్‌రావు మాట్లాడారు. కార్పొరేట్ విద్యకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను ప్రభుత్వం తీర్చిదిద్దుతోందన్నారు. విద్యార్థులు కూడా మెరుగైన ఫలితాలు సాధించడం అభినందనీయమన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పాఠశాలలో వసతులు కరువై ప్రైవేటు వైపు విద్యార్థులు చూసేవారని అన్నారు. నేడు ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పించడంతో ఉత్తమ ఫలితాలు వస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాల అమలులో మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దేందుకు కషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరూ గంట రవీందర్ ను ఆదర్శంగా తీసుకొని సేవా కార్యక్రమాలకు పాటుపడాలని సూచించారు. పాలకుర్తిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానన్న సీఎం కేసీఆర్ హామీని నిలబెట్టుకున్నారని అన్నారు. పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో మహాత్మ జ్యోతిబాపూలే బిసి డిగ్రీ రెసిడెన్షియల్ కళాశాలను మంజూరు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీరమనేని యాకాంతరావు, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ పుస్కునూరి శ్రీనివాసరావు, జిల్లా కో ఆప్షన్ మెంబర్ ఎండీ మదర్, కొడకండ్ల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, ఎంపీటీసీ ఎడవెల్లి పురుషోత్తం, ఎంపీటీసీల ఫోరం జిల్లా గౌరవ అధ్యక్షుడు మాటూరి యాకయ్య, మాజీ ఎంఈఓ లు బుస్సారి రఘుజి, పోతుగంటి నరసయ్య, మాజీ జెడ్పిటిసి గుగులోతు పార్వతి దేవా నాయక్, కస్తూర్బా గురుకులాల పాఠశాల ల స్పెషల్ అధికారులు పాల్గొన్నారు.