Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
2021-22 ఆర్ధిక సంవత్సరం సింగరేణి సంస్థ గడించిన లాభాల్లో 35 శాతం కార్మికుల వాటా వెంటనే ప్రకటించాలని సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్ (ఐఎన్టీయూసీ) భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు జోగ బుచ్చయ్య సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలోని ఐఎన్టీయూసీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఆర్థిక సంవత్సరం కంపెనీకి వచ్చిన లాభాల వివరాలను వెంటనే ప్రకటించాలని, లాభాల నుంచి కార్మికులకు 35 శాతం వాటా ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణి హాస్పిటల్లో స్పెషలిస్టులు లేక సింగరేణి కార్మికులు సరైన సమయంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వెలిబుచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న కార్పొరేట్ హాస్పిటల్స్‌కు సింగరేణి పడ్డ బకాయి వల్ల అక్కడ వైద్యం అందడం లేదని చెప్పారు. ఏరియా హాస్పిటల్లో సీటీ స్కాన్, ఎంఆర్ఐ లేక కార్మికులు వేలాది రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి రూ.500 కోట్లు, మెడికల్ కాలేజీకి వెయ్యి కోట్ల, వరద బాధితులకు ఇండ్లు కోల్పోయిన వారికి డబ్బులు ఇవ్వడ లేదని ప్రశ్నించారు. ఇతర కార్యక్రమాలకు డబ్బును దుర్వినియోగం చేస్తూ, కార్మికులను మాత్రం యాజమాన్యం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. సింగరేణి వైద్యశాఖ లో పరిపాలన అస్తవ్యస్థంగా ఉందని పై అధికారుల మాట క్రింది వారు వినే పరిస్థితి లేదని, మెడికల్ బోర్డు లిస్ట్ అధికారుకంటే ముందే బ్రోకర్ లకు అందిస్తున్నారని విమర్శించారు. సిపిఆర్ఎంస్లోని లోటుపాట్లను వెంటనే సరి చేయాలని, భూపాలపల్లిలో అన్యాయంగా డిస్మిస్ చేసిన 46 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో కేంద్ర కమిటీ ఉపాధ్యక్షుడు పసునూటి రాజేందర్, జనరల్ సెక్రటరీ రఘుపతిరెడ్డి, సెంట్రల్ సెక్రటరీ సదయ్య, కుమార్, బొడ్డు అశోక్, మధుకర్‌రెడ్డి, రాములు, శంకర్, రాజయ్య, రవి కిరణ్, వేణు గోపాల్, తదితరులు పాల్గొన్నారు.