Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెక్కు దొంగలింత రాజకీయ డ్రామా : కాంగ్రెస్
నవతెలంగాణ-శాయంపేట
దళిత యువకుడు నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్డికి పంచాయతీ కార్యదర్శి చెక్కు ఇచ్చారని, అధికార పార్టీ నేతల ఒత్తిడి మేరకే చెక్కు దొంగతనం జరిగిందని కుట్ర చేస్తూ మల్టీపర్పస్ వర్కర్‌ను తొలగించేందుకు రంగం సిద్ధం చేయడం అధికార పార్టీ అహంకార పూరిత రాజకీయాలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి విమర్శించారు. మండలంలోని వసంతాపూర్‌లో శుక్రవారం నిర్వహించిన ముఖ్యకార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొని మాట్లాడారు. మైలారం గ్రామానికి చెందిన దళిత యువకుడు 90 శాతం మరుగుదొడ్డి నిర్మించుకోగా డబ్బులు సరిపోవడం లేదని, బిల్లు ఇస్తే పూర్తి చేస్తానని ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లగా వారి ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి అతని భార్య అనూషపై ఈనెల 19న చెక్కుపై సంతకం చేసి రిజిస్టర్లో సంతకం తీసుకొని అప్పగించి సర్పంచ్ సంతకం చేయించుకోవాలని ఆదేశించినట్లు తెలిపారు. సర్పంచ్ చుట్టూ తిరిగిన చెక్కుపై సంతకం చేయకపోవడంతో ఇటీవల బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి దష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయగా స్థానిక నాయకుడు దళిత యువకులను కాలర్ పట్టి నెట్టేశారి, దాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. సమస్యను వివరించకుండా చేసిన నాయకుడిపై చర్య తీసుకోకుండా, అధికార బలంతో అధికారులపై ఒత్తిడి తెచ్చి చెక్కు దొంగలించబడిందని కుట్ర పన్నుతూ మల్టీపర్పస్ వర్కర్ చెక్కు దొంగతనం చేశాడని, అతనిని విధుల్లో నుంచి తొలగించడం, ఆయనపై పోలీసు కేసు పెట్టాలని నిర్ణయం తీసుకోవడం అహంకారపూరిత రాజకీయాలకు నిదర్శనమని మండిపడ్డారు. దళితబంధు ద్వారా దళిత జీవితాల్లో వెలుగు నింపుతామని గొప్పలు చెప్తున్నా అధికార పార్టీ నాయకులు, ఒక పేద దళితుడికి మరుగుదొడ్డి నిర్మాణం కోసం అధికారులు మంజూరు చేసిన చెక్కును స్థానిక ప్రజాప్రతినిధులు అడ్డుకోవడం శోచనీయమన్నారు. మైలారం గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణానికి రెండు లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం చేశారని, దీనిపై ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోలేదని, దళితుడికి మంజూరైన చెక్కుపై అధికార పార్టీ నాయకులు మల్టీ పర్పస్ వర్కర్‌ను బలి చేయడం సరికాదన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలే అధికార పార్టీకి తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు హింగె భాస్కర్, మారపల్లి రాజేందర్, రాజు, దామోదర్, కార్తీక్, రాజయ్య పాల్గొన్నారు.