Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చోద్యం చూస్తున్న అటవీ, రెవెన్యూ అధికారులు
నవతెలంగాణ-వరంగల్ ప్రాంతీయ ప్రతినిధి
వరంగల్ జిల్లాలో 4 లక్షల 39 వేల 692 ఎకరాల భౌగోళిక విస్తీర్ణం కాగా అటవీ ప్రాంతం 34 వేల 16 ఎకరాలు (7.73 శాతం) మాత్రమే వుండడం గమనార్హం. 11 వేల 247.81 ఎకరాల (33.06 శాతం) అటవీ భూములు అన్యాక్రాంతమయ్యాయి. జిల్లాలో ఖానాపూర్, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ మండలాలకు చెందిన 57 గ్రామాల్లో 34 వేల 16 ఎకరాలు అటవీ భూములుండగా, 11 వేల 247.81 ఎకరాల అటవీ భూములు అన్యాక్రాంతమైనట్లు అధికార వర్గాల లెక్కలు చెబుతున్నాయి. 2002 సెప్టెంబర్ 5వ తేదీ నాటికి అటవీ భూములను ఆక్రమించుకున్న ప్రజలందరినీ అక్కడి నుండి ఖాళీ చేయించేందుకు పర్యావరణ మంత్రిత్వ శాఖ మే 5, 2002న జారీ చేసిన లేఖతో అటవీ నివాస సమూహాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. గిరిజన సంఘాలు చేసిన పోరాట ఫలితంగా షెడ్యూల్డ్ తెగల (అటవీ హక్కుల గుర్తింపు ) బిల్లును 2005 డిసెంబర్ 13న లోక్సభలో ప్రవేశపెట్టారు. 2007 డిసెంబర్ 31వ తేదీ నుండి ఈ చట్టం అమలులోకి వచ్చింది. చట్టం అమలులోకి వచ్చి 15 ఏండ్లయినా పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులకు నేటికీ పట్టాలు ఇవ్వకపోవడం గమనార్హం. పోడు వ్యవసాయం చేస్తున్న వారు 22 వేల 242 ఎకరాలలో అటవీ భూమి హక్కుల పత్రాల కోసం దరఖాస్తు చేసుకోగా, అటవీ శాఖ మాత్రం 11 వేల 247 ఎకరాల అటవీ భూములు ఖబ్జా అయినట్లు చెబుతుంది. అటవీ, రెవెన్యూ శాఖాధికారులు జాయింట్ సర్వే చేసి ఈ వివాదాన్ని పరిష్కరించాల్సి వుండగా, గత 15 ఏండ్లుగా ఈ సమస్యను నాన్చుతూ గిరిజనులపై అటవీ శాఖ కేసులు పెడుతూ వేధింపులకు గురిచేస్తుంది.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు జిల్లాల్లో అటవీభూముల అన్యాక్రాంతం ప్రధాన సమస్యగా వుంది. ఇదిలావుంటే ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పోడు వ్యవసాయం చేస్తున్న ఆదివాసీలకు సైతం నేటికీ పట్టాలు ఇవ్వకపోవడం గమనార్హం. అధికార టిఆర్ఎస్ పార్టీ పోడు వ్యసాయం చేస్తున్న వారికి పట్టాలు ఇస్తామని చెప్పినా నేటికీ ఆచరణకు నోచుకోలేదు. 4 మండలాల్లో 35 గ్రామాల్లో గత 2021 డిసెంబర్ 3వ తేదీ నాటికి 3 వేల 739 మంది ఎస్టీలు, 3,731 మంది గిరిజనేతరులు అటవీ భూములకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. గిరిజనుల ఆధీనంలో 11 వేల 546.55 ఎకరాలు, గిరిజనేతల ఆధీనంలో 10 వేల 687.93 ఎకరాలు, మొత్తంగా 22 వేల 242.88 ఎకరాలు వీరి ఆధీనంలో వుంది. ఈ భూములకుగాను 7,470 మంది పట్టాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అటవీ హక్కుల చట్టం ప్రకారం 2005 డిసెంబర్ 13వ తేదీ నాటికి ఆక్రమణలో వున్న అటవీభూమికి హక్కుపత్రాలు ఇవ్వడానికి అర్హులు. 2005 డిసెంబర్ 13వ తేదీ నాటికి ముందు అడవిలో నివసిస్తూ, అడవి లేదా అటవీ భూములపై తమ జీవనోపాధి అవసరాలకుగాను కనీసం 3 తరాలకుపైబడి నివసిస్తున్నటువంటి ఎవరైనా వ్యక్తి లేదా ఆయా జాతికి చెందినవారు హక్కుపత్రాలు పొందడానికి అర్హులని చట్టం చెబుతుంది.
5 మండలాల్లో 7 వేల 470 మంది దరఖాస్తుదారులు
వరంగల్ జిల్లాలో నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఖానాపూర్, నర్సంపేట, నల్లబెల్లి, నెక్కొండ, చెన్నారావుపేట మండలాల్లో 35 పంచాయతీల పరిధిలో 22 వేల 242.88 ఎకరాల అటవీ భూములలో ఆక్రమణలో వున్న 7,470 మంది అటవీ హక్కుల గుర్తింపు చట్టం కింద దరఖాస్తులు చేసుకున్నారు. వీటిని విచారించి అర్హులైన వారికి పట్టా ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. ఇప్పటి వరకు దరఖాస్తు చేసిన వారిలో గిరిజనులు 3,739 మంది 11 వేల 546.55 ఎకరాల భూమికి హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. గిరిజనేతరులు 3,731 మంది 10 వేల 687.93 ఎకరాలకు హక్కు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖానాపూర్ మండలంలో 15 పంచాయతీలలో 1681 మంది గిరిజనులు 5,092.03 ఎకరాల కోసం, గిరిజనేతలరు 1,927 మంది 4,873.59 ఎకరాలు, నర్సంపేట మండలంలో 5 పంచాయతీలలో గిరిజనులు 556 మంది 1,352.58 ఎకరాలు, గిరిజనేతరులు 465 మంది 998.42 ఎకరాలు, నల్లబెల్లి మండలంలో 6 పంచాయతీలలో గిరిజనులు 1,088 మంది 3,952.07 ఎకరాలు, గిరిజనేతరులు 936 మంది 3,745.45 ఎకరాలు, నెక్కొండ మండలం 6 పంచాయతీలలో గిరిజనులు 382 మంది 1,063.55 ఎకరాలు, గిరిజనేతరులు 324 మంది 870.27 ఎకరాలు, చెన్నారావుపేట మండలంలో 3 పంచాయతీలలో 32 మంది గిరిజనులు 86.32 ఎకరాలు, గిరిజనేతరులు 79 మంది 200.2 ఎకరాలకు హక్కు పత్రాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు.
వివాదాల పరిష్కారానికి చర్యలేవీ..?
వరంగల్ జిల్లాలో అటవీ శాఖకు చెందిన 11 వేల 247 ఎకరాల భూమిని 2,956 మంది ఆక్రమించుకున్నారని తన నివేదికలో పేర్కొంది. ఇదే క్రమంలో అటవీ హక్కుల చట్టం కింద 22 వేల 242 ఎకరాలకు 3,739 మంది గిరిజనులు, 3,731 మంది గిరిజనేతరులు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. అటవీ గ్రామాల్లో భూముల సరిహద్దులకు సంబంధించి పలు వివాదాలున్నాయి. అంతేకాదు, అంతేకాదు అటవీ హక్కుల చట్టం ప్రకారం పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులపై అటవీ శాఖ వేధింపులకు గురిచేయడం, అక్రమ కేసులు పెట్టడం షరామాములుగా మారింది. ఈ వివాదాన్ని రెవెన్యూ, అటవీ శాఖలు సంయుక్తంగా సర్వే చేసి పరిష్కరించాల్సి వుండగా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో గత 15 ఏండ్లుగా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఫలితంగా పోడు చేస్తున్న గిరిజన రైతులపై అటవీ శాఖ నేటికీ అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్న దుస్థితి వుంది. పలు గ్రామాల్లో గిరిజనులు, అటవీ శాఖాధికారులు పరస్పరం దాడులు చేసుకున్న పరిస్థితి కూడా వుంది. ఇదిలావుంటే తాజాగా రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో జిల్లాస్థాయి సమన్వయ కమిటీల సమావేశాన్ని జరిపి అటవీ హక్కుల చట్టం అమలు తీరును మంత్రులు, కలెక్టర్లు సమీక్షించడంతో కొంత కదలిక రావడం గమనార్హం. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని గిరిజనులు కోరుతున్నారు.