Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హనుమకొండ
హనుమకొండ, భూపాలపల్లి జిల్లాల్లోని అన్ని మండలాల్లో, గ్రామాల్లో ఆదివారం ఎంగిలిపూల బతుకమ్మ పండుగను మహిళలు వేడుకగా నిర్వహించారు. హనుమకొండలోని వేయి స్థంబాల, భద్రకాళీ, ఇతర ఆలయాల్లో మహిళలు బతుకమ్మలతో పోటెత్తగా దేవాదాయ, పోలీస్, ఇతర శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. చిన్న పిల్లల నుంచి మొదలుకొని మహిళలు బతుకమ్మలతో సందడి చేశారు. ఆడిపాడారు.
శాయంపేట : మండలంలోని 24 గ్రామపంచాయతీల్లో ఆదివారం బతుకమ్మ మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. తీరక పూలతో పేర్చిన బతుకమ్మలతో గ్రామాల్లోని ఆలయాల్లో మహిళలు బతుకమ్మ ఆటలు ఆడారు. ఆయా గ్రామాల సర్పంచ్‌లు ఆలయాల వద్ద హైమాస్ట్ లైట్లను, డీజే సౌండ్‌ను ఏర్పాటు చేశారు. ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలతో గ్రామాల్లో సందడి నెలకొంది. శాయంపేటలో శివ మార్కండేయ ఆలయ ప్రాంగణం, శ్రీ మత్స్యగిరి స్వామి ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మెన్లు బాసాని సూర్యప్రకాష్, సామల భిక్షపతి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు పోలీస్ బందోబస్తు నిర్వహించారు.
మల్హర్రావు : సద్దుల బతుకమ్మ ఉత్సవాలను పురస్కరించుకుని మండలవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఆదివారం ఎంగిలి పూల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఉదయం నుంచి మహిళలు నియమనిష్ఠలతో రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి నత్యాలు, కోలాటాలు వేస్తూ అటపాటలతో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. బతుకమ్మ సంబరాల్లో ఎంపీపీ మల్హర్రావు, వైస్ ఎంపీపీ బడితెల స్వరూప రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.
పరకాల : ఎంగిలి బతుకమ్మతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగియనున్న వేడుకల కోసం పట్టణంలోని పశువుల సంత మైదానంలో మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మహిళలు వేడుకగా బతుకమ్మ ఆడారు. మున్సిపల్, పోలీస్ శాఖల ఆధ్వర్యంలో సదుపాయాలు కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అనిత రామకష్ణ, వైస్ చైర్మెన్ రేగూరి జైపాల్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ప్రభుత్వ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
రేగొండ : మండలంలో ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలంలోని అన్ని గ్రామాల్లో ఆడపడుచులు ఉదయం నుంచే తీరొక్క పూలు సేకరించి బతకమ్మలను పేర్చారు. సాయంత్రం గ్రామాల్లోని భూలక్ష్మి మహాలక్ష్మి, సీతా రామాలయాల్లో బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఎంపీపీ పున్నం లక్ష్మీ రవి, ఆయా గ్రామాల్లో సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు.
మహాదేవ్‌పూర్ : మండలంలోని అన్ని గ్రామాల్లో ఎంగిలి పూల బతుకమ్మ నిర్వహించారు. మహిళలు బతుకమ్మలను పేర్చి సంస్కృతి, సంప్రదాయాన్ని చాటేలా ఆడిపాడారు. అన్ని గ్రామాల్లో పంచాయతీల ఆధ్వర్యంలో బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో ఏర్పాట్లు చేశారు.