Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర బొగ్గు గనుల మంత్రికి బీఎంఎస్ వినతి
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
సింగరేణిలో 17 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం చేయాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సింగరేణి కోల్‌మైన్స్ కాంట్రాక్ట్ మజ్దూర్ సంఫ్‌ు (బీఎంఎస్) అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్, ఏబీకేఎంఎస్ జాతీయ కార్యవర్గ సభ్యులు మండ రమాకాంత్, పులి రాజారెడ్డి, పెండం సత్యనారాయణ ఆదివారం వినతిపత్రం అందించారని భూపాలపల్లి బ్రాంచ్ ఉపాధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించి సంస్థ సీఎండీకి ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని, ఈనెల 26న రీజనల్ లేబర్ కమిషనర్ వద్ద జరిగే చర్చలతో పరిష్కారం చేయాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు జీఓ నెంబర్ 22ను అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని, 8.33 బోనస్ కాంట్రాక్ట్ కార్మికులకు 20 శాతం పెంచుటకు తగిన చర్యలు తీసుకోవాలని, హైపవర్ కమిటీ వేతనాలు కోల్ ఇండియా మాదిరిగా సింగరేణిలో అమలు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు పర్మనెంట్ కార్మికుల మాదిరిగా వైద్య సదుపాయం అందించాలని, కరోనా సమయంలో చనిపోయిన కాంటాక్ట్ కార్మికులకు జేబీసీసీఐ ఒప్పందం ప్రకారం 15 లక్షల రూపాయలు ఇవ్వాలని, గని ప్రమాదంలో చనిపోయిన కాంటాక్ట్ కార్మికులకు 15 లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని, మిగులు క్వార్టర్స్ కాంట్రాక్ట్ కార్మికులకు ఇవ్వాలని, చట్టబద్ధత కలిగిన హక్కులు సౌకర్యాలు అమలు చేయాలని, వేతనంతో కూడిన జాతీయ సెలవులు, పండుగ సెలవులు, ఆర్జిత సెలవులు, క్యాంటీన్ సదుపాయం అమలు చేయాలని, ప్రతినెల 7లోపు వేతనం చెల్లించాలనే కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని సూచించారని శ్రీనివాస్ వివరించారు.