Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మావోయిస్టు కేరళపాల్ ఏరియా కమిటీ దళ సభ్యుడు లొంగుబాటు
- జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జి పాటిల్ వెల్లడి
నవతెలంగాణ-ములుగు
ప్రభుత్వ సరెండర్-కమ్-రిహాబిలిటేషన్ విధానంలో భాగంగా సీపీఐ(మావోయిస్ట్) పార్టీ సిద్ధాంతాలతో విసిగిపోయిన చత్తీస్ఘడ్ రాష్ట్రం సుక్మ జిల్లా కేరళ పాల్ ఏరియా కమిటీ డీకెఎస్జెడ్సి దళం సభ్యుడు పేదం దేవ మంగళవారం ఎస్పీ డాక్టర్ సంగ్రామ్‌సింగ్ జి పాటిల్ సమక్షంలో లొంగిపోయాడు. ఎస్పీ కార్యాలయంలో ఓఎస్డి గౌష్ ఆలం, ఏఎస్పీ సుధీర్ కేకన్, సిసిఎస్ సీఐ జి.రవీందర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జనజీవన స్రవంతిలో చేరడానికి, సాధారణ ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి దేవా లొంగిపోయినట్లు వెల్లడించారు. పెద్దం దేవ పేద కుటుంబానికి చెందిన వాడని, నిరక్షరాస్యుడని, అతను చిన్న వయస్సులోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. అతను నక్సల్ ప్రభావిత ప్రాంతమైన సుక్మా జిల్లాలోని కేర్లపాల్ ప్రాంతానికి చెందినవాడిగా వివరించారు. అతని గ్రామంలో పిఎల్ దళం కమాండర్, నక్సల్స్, మిలీషియా సభ్యులు తరచూ సందర్శించి, వారి భావజాలాన్ని వివరిస్తూ సమావేశాలు నిర్వహించి విప్లవ గీతాలు పాడేవారన్నారు. ఈ విషయం చిన్న వయస్సులోనే వారి భావజాలానికి ఆకర్షితుడై, మొదట్లో బాలల సంఘంలో 6 సంవత్సరాలు పనిచేశాడని, ఆ తర్వాత సీఎన్ఎంలో పనిచేశారన్నారు. మే 2021, అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, పార్టీ సభ్యుడిగా చేరాడన్నారు. తరువాత అతను పిఎల్ మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ కార్యదర్శికి గార్డ్ గా ఉన్నాడన్నారు. మావోయిస్టు పార్టీని వీడడానికి ప్రధాన కారణాలను ఎస్పీ వివరించారు. మావోయిస్ట్ అగ్రనేతలు దిగువ క్యాడర్‌కు అదనపు పనిని ఇవ్వడం ద్వారా దుర్వినియోగం చేస్తున్నారనీ, దిగువ క్యాడర్ల ఆరోగ్య సమస్యలను పార్టీ నాయకత్వం నిర్లక్ష్యం చేస్తోందని, ప్రస్తుత పరిస్థితులలో, ప్రభుత్వ సంక్షేమ ఆధారిత, ప్రజలకు అనుకూలమైన విధానాలతో పాటు డిజిటల్ విప్లవం వెలుగులో విప్లవాత్మక ఉద్యమాన్ని కొనసాగించడానికి సాయుధ సంస్థకు ఎటువంటి ఆధారాలు లేవని ఆయన గ్రహించారన్నారు. మావోయిస్టు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ ప్రాంతంలోని అమాయక గిరిజనులను వాడుకుంటున్నారనే వాస్తవాన్ని కూడా అతను గ్రహించాడనీ, అమాయక గిరిజనులను తమలో తాము పొట్లాడు కునేలా చేస్తున్నారని, వారి ప్రయోజనం ముగిసిన తర్వాత, వారిని పోలీసు ఇన్ఫార్మర్లుగా ముద్రవేసి నిర్దాక్షిణ్యంగా చంపుతున్నారన్నారు. అన్నింటికీ మించి, అతను తన ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి తెలుసుకుని జన జీవన (ప్రధాన) స్రవంతి జీవితంలో చేరాలనుకుంటున్నాడని అన్నారు. లొంగిపోయిన దేవకు పోలీస్ శాఖ తరపున ఆర్థిక సాయం అందించారు.