Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒకేరోజు కుక్కకాటుకు గురైన నలుగురు వ్యక్తులు
- అందుబాటులో లేని ఆత్మకూర్ పీహెచ్సీ సిబ్బంది
నవతెలంగాణ-ఆత్మకూర్
అత్యవసర పరిస్థితుల్లో ప్రయివేట్ ఆసుపత్రుల్లో వైద్యం నిరాకరించిన పక్షంలో ప్రజలు ప్రభుత్వ ఆసు పత్రులనే ఆశ్రయిస్తుంటారు. 24 గంటలు ప్రభుత్వ పిహెచ్సీలో సిబ్బంది అందుబాటులో ఉండి ఆసుపత్రికి వచ్చిన వారికి వైద్య సహాయం చేయాలి. కానీ ఆత్మకూర్ మండల కేంద్రంలోని పీహెచ్సీలో ఇందుకు భిన్నంగా ఉంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు వైద్యం కోసం వస్తే ఆసుపత్రి సిబ్బంది లేని దుస్థితి నెలకొంది. మంగళవారం సాయంత్రం మండల కేంద్రానికి చెందిన ఏళ్ళబాయిన క్రాంతి కుమార్, గుండెబోయిన అరుణ, తిరుమలగిరికి చెందిన మోరే బుషన్న, మడిషెట్టి రాధ నలుగురు కుక్కకాటుకు గురై ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆశ్రయించారు. అక్కడ సిబ్బంది లేకపోవడంతో పాటు ఆసుపత్రి మూసి ఉండడంతో వైద్య సహాయం పొందక వెనుదిరగాల్సి వచ్చింది. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెద్ద ఎత్తున వైద్యారోగ్యశాఖ నిధులు కేటాయిస్తుంటే ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మాత్రం సేవలు అందుబాటులో లేకపో వడం గమనార్హం. దీంతో ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల ప్రజలు నమ్మకాన్ని కోల్పోతున్నారు. ఇప్పటికై ఆత్మకూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి ఆసుపత్రిపై శ్రద్ధ చూపించాలని మండల ప్రజలు కోరుతున్నారు. ఇదే విషయమై ఇన్చార్జి మండల వైద్యాధికారిణి పద్మశ్రీ వివరణ కోరగా..24 గంటల మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రమైనప్పటికీ రెండు స్టాఫ్ నర్స్ పోస్టులు ఖాళీగా ఉండగా.. స్టాఫ్ నర్స్ ఒక్కరే ఉండటం వల్ల రాత్రిపూట ఎవరు ఉండటం లేదని తెలిపారు. రేపు ఉదయం పంపించండని తెలిపడం గమనార్హం.