Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ వేడుకల నేపథ్యంలో
- చెరువుల వద్ద కానరాని ఏర్పాట్లు
- మిషన్ కాకతీయ తొ పెరిగిన చెరువుల లోతు
నవతెలంగాణ-తొర్రూరు
బతుకమ్మ పండుగకు ఆడపడుచులు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. ఎంగిలిపూల బతుకమ్మ నుంచి సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులపాటు మహిళలు, యువతులు, చిన్నారులు ఆడుతూ.. పాడుతూ బతుకమ్మ వేడుకలను జరుపుకుం టారు. చివరి రోజు సద్దుల బతుకమ్మను గ్రామ శివారులోని చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేయడం ఆనవాయితీ. అయితే మండలవ్యాప్తంగా నిమజ్జన ఏర్పాట్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కొన్ని చెరువులు, కుంటల వద్ద ఘాట్లు ఏర్పాటు చేయడంలో అధికారులు, కాంట్రాక్టర్లు పూర్తిగా విఫలమయ్యారు. మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా ఘాట్లు ఏర్పాటు చేయాలని నిబంధనలు ఉన్న కాంట్రాక్టర్లు గాలికి వదిలేశారు.
ప్రమాదకరంగా చెరువులు...
గ్రామాల్లోని చెరువులు నీటితో నిండి ఉన్నాయి. ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, అధికారులు పండుగ నేపథ్యంలో చెరువుల వద్ద పకడ్బందీ చర్యలు చేయాల్సి ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మండలంలో ఒక మున్సిపాలిటీ, 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. వీటి పరిధిలో 58 చెరువులు ఉన్నాయి. అక్టోబర్ 3న సద్దుల బతుకమ్మతో వేడుకలు ముగు స్తాయి. నిమజ్జనం చేసే ప్రాంతాల వద్ద ఏర్పాట్లపై మహిళలు ఆందోళన చెందుతున్నారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల్లో కూడికతీత పనులు చేపట్టడంతో చెరువుల లోతు పెరిగింది. ఇటీవల కురిసిన వర్షాలకు నీటిమట్టం బాగా పెరిగింది. ఘాట్లు ఏర్పాటు చేయకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్ర తినిధులు చొరవ తీసుకొని చెరువుల వద్ద ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
బతుకమ్మను చెరువులు, కుంటల వద్ద నిమజ్జనం చేసే ముందు ఎంతమంది కుటుంబ సభ్యులు వెళుతున్నారో చూసుకోవాలి. అధికారులు ఏర్పాటు చేసిన ఘాట్ల వద్ద మాత్రమే నిమజ్జనం చేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరేచోట నిమజ్జనం చేయరాదు. మిషన్ కాకతీయ పనులతో చెరువుల లోతు పెరిగింది. ఎక్కడ ఎంత లోతు ఉంటుందో తెలియక ప్రమాదం జరగవచ్చు. ముఖ్యంగా చిన్నారులు చెరువుల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి. ఇంటి నుండి ఎంతమంది వెళుతున్నారో ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. ఆకతాయిలు ఇబ్బంది పెడితే డయల్ 100 కు ఫోన్ చేయాలి.
గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నాం
సద్దుల బతుకమ్మ నిమజ్జనం నేపథ్యంలో అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం. చైన్ స్నాచింగ్ జరగకుండా నాలుగు పెట్రోలింగ్ పార్టీలను ఏర్పాటు చేశాం. ప్రతి చెరువు వద్ద నలుగురు గజ ఈతగాండ్లు ఉంటారు. మహిళలు చెరువులోకి దిగకుండా వీరి ద్వారా నిమజ్జనం చేయాలి. ఆకతాయిలు ఇబ్బంది పెడితే సమాచారం ఇవ్వాలి. ప్రతీ గ్రామాన్ని పోలీసులు పర్యవేక్షిస్తారు.
- గండ్రాతి సతీష్, ఎస్సై, తొర్రూరు