Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ద్విచక్ర వాహనం ఆధారంగా గుర్తింపు
- మృతదేహం కోసం గాలింపు ముమ్మరం
- పరిస్థితిపై సమీక్షిస్తున్న ఏసీపీ శివరామయ్య
నవతెలంగాణ-శాయంపేట
కొప్పుల-జోగంపల్లి గ్రామాల మధ్య చలివాగు లో లెవెల్ బ్రిడ్జిపై ప్రవహిస్తున్న నీటిలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వ్యక్తి గల్లంతైన సంఘటన మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు బుధవారం గాలింపు చర్యలు చేపట్టగా ద్విచక్ర వాహనం లభ్యం కాగా వాహనం నెంబర్ ఆధారంగా కానిస్టేబుల్ చేన్న రాజుగా గుర్తించారు. పరకాల ఏసిపి జే. శివరామయ్య సందర్శించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... వరంగల్ పట్టణానికి చెందిన చేన్న రాజు (47) దామెర పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. రాజుకు భార్య శ్రీదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఆరెపల్లెలో నివసిస్తున్నారు. బతుకమ్మ పండుగకు పిల్లలకు సెలవులు రావడంతో శ్రీదేవి ఇద్దరు కుమార్‌లను తీసుకొని పుట్టింటికి కొప్పుల గ్రామానికి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం రాజు పిల్లల బట్టలు కొనడానికి భార్య శ్రీదేవికి డబ్బులు ఇవ్వడానికి తన ద్విచక్ర వాహనంపై కొప్పులకు బయలుదేరాడు. ఈ క్రమంలో బ్రిడ్జిపై చలివాగు వరద నీరు ఉదతంగా ప్రవహిస్తున్నడంతో బ్రిడ్జి మధ్యకు రాగానే వాహనం స్క్రీడ్ అయి వాహనంతో సహా రాజు నీటిలో పడిపోయాడు. పడిపోయిన వాహనాన్ని లేపుతుండగా వరద నీరు తాకిడికి వాహనంతో సహా నీటిలో కొట్టుకుపోయాడు. ఈ విషయం బుధవారం గ్రామంలో వెలుగు చూడడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఇమ్మడి వీరభద్రరావు సిబ్బందితో చేరుకొని స్థానిక గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. బ్రిడ్జ్ కింద ద్విచక్ర వాహనం లభ్యం కావడంతో వాహనం నెంబర్ ఆధారంగా గల్లంతయిన వ్యక్తి కానిస్టేబుల్ రాజుగా పోలీసులు గుర్తించారు. దీంతో సమాచారాన్ని కుటుంబ సభ్యులకు చేరవేశారు. మృతదేహం లభ్యం కాకపోవడంతో పరకాల అగ్నిమాపక సిబ్బందిని రప్పించి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సంఘటన స్థలాన్ని పరకాల ఏసీపీ శివరామయ్య, పరకాల రూరల్ సీఐ శ్రీనివాసరావు సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. చలి వాగులో కానిస్టేబుల్ రాజు గల్లంతు అయిన విషయం తెలియడంతో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మతదేహం లభ్యమైతేనే మరిన్ని వివరాలు తెలుస్తాయని పోలీసులు తెలుపుతున్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేయనున్నట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు.