Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ పోలీస్ కమిషనర్ డాక్టర్ తరుణ్ జోషీ
నవతెలంగాణ-హన్మకొండ క్రైమ్
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీలకు పాల్పడతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను సీసీఎస్, మామూనూర్ పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి రూ.10 లక్షల విలువైన 166 గ్రాముల బంగారు అభరణాలతోపాటు కారు, ల్యాప్‌టాప్, రెండు సెల్ ఫోన్లు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ (సీపీ) డాక్టర్ తరుణ్ జోషి వివరాలను వెల్లడించారు. ఏపీలోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ప్రాంతానికి చెందిన షేక్ ఖాసీం, షేక్ నాగుల్ మీర, తల్లాడి భాస్కర్ దుర్గాప్రసాద్, కర్రి రాజేష్ (పస్తుతం పరారీలో వున్నాడు) గతంలో ఏలూరు, ఖమ్మం జిల్లాల్లో తాళం వేసి ఉన్న ఇండ్లలో చోరీ చేయడంతోపాటు ద్విచక్ర వాహనాలను చోరీ చేశారు. షేక్ ఖాసీం రాజేష్‌తో కలిసి ఈనెల 19న జంగారెడ్డిగూడెం ప్రాంతంలో నాలుగు చోరీలకు పాల్పడ్డారు. మరో నిందితుడు షేక్ నాగుల్ మీరా జంగారెడ్డిగూడెంలో అక్రమంగా మద్యం సరఫరా చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి అత్తగారు మామూనూర్ ప్రాంతానికి చెందిన వారు కావడంతో కారులో అక్కడికి వచ్చి పోయేవాడు. ఈ నలుగురు నిందితులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీ చేసేందుకు సిద్ధపడ్డారు. వరంగల్ నగరానికి కారులో వచ్చి పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 7 చోరీలకు పాల్పడ్డారు. క్రైమ్స్ అదనపు డీసీపీ పుష్పా అదేశాల మేరకు సీసీఎస్, మామూనూర్ డివిజన్ పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలో పోలీసులు మామూనూర్ నాయుడు పెట్రోల్ పంపు ప్రాంతంలో వాహన తనీఖీలు నిర్వహిస్తుండగా నిందితులు ప్రయాణిస్తున్న కారును పోలీసులు అనుమానంతో అపేందుకు ప్రయత్నించగా నిందితులు తప్పించుకోనేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు నిందితులను వెంబడించి అదుపులోకి తీసుకోని తనిఖీ చేయగా చోరీ చేసిన సొత్తు లభించింది. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబర్చిన అదనపు డీసీపీ పుష్పారెడ్డి, సీసీఎస్, మామూనూర్ ఏసీపీలు డేవిడ్ రాజు, నరేష్కుమార్, ఇన్స్పెక్టర్లు రమేష్‌కుమార్, శ్రీనివాసరావు, క్రాంతికుమార్, ఏఏఓ సల్మాన్ పాషా, ఎస్సైలు యాదగిరి, బాబురావు, ఏఎస్సై వీరస్వామి, హెడ్ కానిస్టేబుల్లు రవికుమార్, జంపయ్య, కనక సారయ్య, షర్ఫుద్దీన్, కానిస్టేబుల్లు విశ్వేశ్వర్, వంశీ, నజీరుద్దీన్, రమేష్, ఐటీ కోర్ కానిస్టేబుల్ నగేష్, హోమ్ గార్డ్ రంజిత్ కుమార్‌ను పోలీస్ కమిషనర్ అభినందించారు.