Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్
- ఎస్ఎఫ్ఐ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులు
నవతెలంగాణ-భూపాలపల్లి
మతోన్మాద రాజకీయాలను తరిమికొట్టాలని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ పిలుపునిచ్చారు. ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన రెండో రోజు రాష్ట్రస్థాయి కార్యకర్తల శిక్షణ తరగతులను బుధవారం ఆయన ప్రారంభించి 'స్వాతంత్య్ర ఉద్యమంలో కమ్యూని స్టుల పాత్ర' అంశంపై బోధించారు. దేశంలో స్వాతంత్ర ఉద్యమంలో పాత్ర లేని మతోన్మాద రాజకీయ పార్టీలు దేశాన్ని ఉద్ధరించినట్టు ఊదరగొడుతున్నాయని విమర్శించారు. దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేట్, కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ నిరుద్యోగ సమస్యను పరిష్కరించడం లేదని మండిపడ్డారు. ఉపాధి కల్పించ డాన్ని విస్మరించి కులాల, మతాల నడుమ చిచ్చు పెడుతూ ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని రావణకాష్టంగా మార్చడం కోసం కుట్ర చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద రాజకీయ పార్టీలను దేశం నుంచి తరిమికొట్టడం కోసం విద్యార్థులు, యువకులు ఏకం కావాలని పిలుపునిచ్చారు. బడా పట్టుబడిదారులకు బానిసలుగా మారి వారికి ఊడిగం చేస్తున్న మతోన్మాద రాజకీయ నాయకులకు గుణపాఠం చెప్పాలన్నారు. దేశంలో శాస్త్రీయ విద్యా విధానం కోసం పాటుపడాల్సిన అవసరం ఉందని చెప్పారు. దేశంలో ఆకలిచావులు, నిరుద్యోగం పెరుగుతున్నా, రైతులు ఆత్మహత్యలు జరుగుతున్నా కేంద్రంలోని బీజేపీ పట్టించు కోకుండా రాష్ట్రాల హక్కులను కాలరాస్తూ దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసేలా బడాబాబుల అప్పులను మాఫీ చేస్తూ దుష్టపాలన సాగిస్తోందని తెలిపారు. అలాగే తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఏమాత్రం తెలియని వ్యక్తులు రాష్ట్రంలో కులాల, మతాల నడుమ చిచ్చు పెట్టడానికి చరిత్రను వక్రీకరిస్తూ ఓట్లు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని ఆందోళన వెలిబుచ్చారు. విద్యార్థులు, యువత మతోన్మాద పార్టీల తప్పుడు విధానాలపై ప్రజలను చైతన్యవంతం చేసి మతోన్మాద రాజకీయ పార్టీలను తరిమికొట్టేలా ఉద్యమాలు నిర్మించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు తాళ్ల నాగరాజు, ఆర్ఎం మూర్తి, సీఐటీయూ జిల్లా నాయకుడు బందు సాయిలు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, దామెర కిరణ్, జిల్లా ఉపాధ్యక్షులు గోపిరాజు, బొడ్డు స్మరన్, సహాయ కార్యదర్శి కిషోర్, సంపత్‌రెడ్డి, నాయకులు విష్ణు, సాయి, కార్తీక్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.