Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నీరు ఉధృతంగా ప్రవహిస్తే క్యాజువేపై ప్రయాణం
- వాహనదారులకు తప్పని తిప్పలు
నవతెలంగాణ-శాయంపేట
మండలంలోని కొప్పుల-జోగంపల్లి గ్రామాల మధ్య చలివాగు మత్తడి పై నిర్మిస్తున్న హై లెవెల్ వంతెన నిర్మాణం నాలుగేళ్లుగా కొనసాగుతూనే ఉంది. వర్షాకాలంలో చలివాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరి అలుగు పోసినప్పుడల్లా మత్తడి పైనుండి వరద నీరు ప్రవహిస్తుండడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో స్పందించిన అప్పటి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి మత్తడిపై బ్రిడ్జి నిర్మాణానికి ఏడు కోట్ల 30 లక్షల నిధులు మంజూరు చేయగా, 2018లో పనులు ప్రారంభం అయ్యాయి. అప్పటినుండి ఇప్పటివరకు పనులు నత్త నడకన జరుగుతూనే ఉన్నాయి. వర్షాలకు ప్రాజెక్టులో వరద నీటి ఉధతి పెరిగి మత్తడి పై నీరు ప్రవహిస్తుండడంతో రెండు గ్రాముల మధ్య రాకపోకలు నిలిచిపోతున్నాయి. దీంతో ద్విచక్ర వాహనదారులు కొప్పుల వెళ్లాలంటే పరకాల, చెన్నాపూర్ మీదుగా వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. గత్యంతరం లేక వాహనదారులు ప్రమాదమని తెలిసినప్పటికీ సర్కస్ ఫీట్లు చేస్తూ క్యాజువే పై ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. చలివాగు మత్తడిలో గతంలో అల్లే రాజు అనే విద్యార్థి బట్టలు ఉతుకుతూ వాగులో కొట్టుకుపోయి మరణించగా, ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కానిస్టేబుల్ రాజు మంగళవారం వరద నీటిలో కొట్టుకపోయి మరణించాడు. ఇప్పటికైనా అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి త్వరితగతన బ్రిడ్జి నిర్మాణం చేపట్టి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుతున్నారు.