Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షీ టీమ్ ఎస్సై విద్యాసాగర్
నవతెలంగాణ-హన్మకొండ క్రైమ్
నేరాలను అదుపు చేయడంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని షీ టీమ్ ఎస్సై కంచి విద్యాసాగర్ కోరారు. వరంగల్‌లోని ఎల్బీ కళాశాలలో బుధవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సైబర్ నేరాలు, మహిళల, విద్యార్థులపై జరుగు తున్న అఘాయిత్యాల మీద ఆయన మాట్లాడారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్, ఈవ్ టీజింగ్‌పై అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యార్థినులు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాలో వ్యక్తిగత ఫొటోలు, వివరాలు పంచు కోవడంలో జాగ్రత్త వహించాలని చెప్పారు. ఎవరి నుంచి ఇబ్బందులు ఎదురైనా షీ టీమ్‌కు ధైర్యంగా సమాచారం అందించాలని తెలిపారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచి నేరగాళ్లపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. సమస్యలను తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, ఉపాధ్యాయులతో పంచుకోవడం ద్వారా నేరాలను ప్రాథమిక దశలోనే నివారించవచ్చని స్పష్టం చేశారు. ప్రిన్సిపాల్ డాక్టర్ అరుణరావు మాట్లాడుతూ విద్యార్థినులు అపరిచితుల పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అధ్యాపకులు కెప్టెన్ డాక్టర్ సదానందం, ఎన్ఎస్ఎస్ అధికారులు డాక్టర్ రాఘవేందర్‌రెడ్డి, లలిత, శ్రీనివాస్, మధూకర్‌రావు, షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ భిక్షనాయక్ తదితరులు పాల్గొన్నారు.