Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు జి ప్రభాకర్‌రెడ్డి
నవతెలంగాణ-ఎన్జీవోస్ కాలనీ
ట్రాన్స్పోర్ట్ కార్మికుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రైవేట్ సెక్టార్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్షుడు జి ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హనుమకొండ రాంనగర్‌లోని ఫెడరేషన్ జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మహాసభను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేంద్రంలో బీజేపీ రెండోసారి అధికారంలోకి వచ్చాక 2019లో మోటార్ వాహనాల చట్టం పేరుతో ట్రాన్స్పోర్ట్ కార్మికులపై మరిన్ని భారాలు మోపిందని విమర్శించారు. ఆ చట్టం పూర్తిస్థాయిలో అమలైతే ట్రాన్స్పోర్ట్ కార్మికుల భవిష్యత్ అంధకారంలో కూరుకుపోతుందని చెప్పారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వర్కర్లు ఉద్యోగాల కోసం ప్రైవేట్ వాహనాలు కొనుక్కొని జీవితాన్ని కొనసాగిస్తూ సమాజంలో సామాజిక బాధ్యత నిర్వహిస్తున్నారని తెలిపారు. వారిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కరోనా వల్ల కార్మికులు మూడేండ్లపాటు కుటుంబ పోషణకు, ఫైనాన్స్ చెల్లించలేక కంపెనీల నుంచి ఇబ్బందులకు గురయ్యారని ఆందోళన వెలిబుచ్చారు. పలువురు డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్న దుస్థితి నెలకొందని చెప్పారు. కరోనా కాలంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ వర్కర్లకు సాయం అందించలేదని ధ్వజమెత్తారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాగుల రమేష్ మాట్లాడుతూ ట్రాన్స్పోర్ట్ కార్మికులు రాత్రింబవళ్లు కష్టపడి పని చేస్తూ కుటుంబాలను పోషించుకుంటూనే సామాజిక బాధ్యత నిర్వహిస్తున్నారని తెలిపారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న 44 చట్టాలను 4 కోడ్లుగా మార్చి కార్మికులకు తీరని నష్టం కలిగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రూ.26 వేల కనీస వేతనాన్ని కూడా అమలు చేయడం లేదన్నారు. 2019 మోటర్ వాహన చట్టం వల్ల ఇన్సూరెన్స్, టాక్స్, ఫిట్నెస్ పేరుతో లక్షలాది రూపాయలు దండుకుంటోందంటూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. వాహనాల స్పీడ్ పేరుతో సీక్రెట్ కెమెరాలు పెట్టి కార్మికులపై అదనపు భారాన్ని మోపుతోందని చెప్పారు. కార్మికుల ఐక్యపోరాటాల ద్వారా ఇటీవల ఫిట్నెస్ ఫైన్‌ను రద్దు చేయించామని తెలిపారు. ఐక్యపోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమౌతాయని స్పష్టం చేశారు. అనంతరం ప్రైవేట్ విద్యాసంస్థల జిల్లా అధ్యక్షుడు బి సారయ్య, ఆర్టీసీ హైర్ బస్ డ్రైవర్ల సంఘం సలహాదారు యాదగిరి, తెలంగాణ క్యాబ్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు నాగరాజు, ఇబ్రహీమ్, ఐఆర్టీడబ్ల్యూఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మహబూబ్ పాషా ప్రసంగించారు. అనంతరం ఏఐఆర్టీడబ్ల్యూఎఫ్ జిల్లా కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడుగా సారయ్య, జిల్లా అధ్యక్షుడుగా జి ప్రభాకర్‌రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్‌గా యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బొల్లారం సంపత్, కోశాధికారిగా గడ్డమీది దేవేందర్, ఉపాధ్యక్షులుగా బి రమేష్, కిట్టు, కుర్సపల్లి సంపత్, కార్యదర్శులుగా ఇబ్రహీమ్, కె రాజు, ప్రభాకర్, మరో 13 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.