Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాశిబుగ్గ
హమాలీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారమయ్యే వారికి అండగా ఉంటామని సీఐటీయూ వరంగల్ జిల్లా కార్యదర్శి ముక్కెర రామస్వామి అన్నారు. గురువారం తెలంగాణ ఆల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్(సీఐటీయూ) మొదటి మహాసభ సందర్భంగా జిల్లా కన్వీనర్ అక్కెనపల్లి యాదగిరి ఆధ్వర్యంలో బాలాజీనగర్ జంక్షన్ నుంచి ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మార్కెట్ ఆవరణలో అక్కెనపల్లి యాదగిరి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు ముఖ్యఅతిథిగా ముక్కెర రామస్వామి హాజరై మాట్లాడారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హమాలీ కార్మికుల హక్కుల సాధన కోసం రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉదతం చేస్తామన్నారు. అనంతరం జిల్లా కన్వీనర్ అక్కెనపల్లి యాదగిరి మాట్లాడుతూ... ఆల్ హమాలీ వర్కర్స్ ఫెడరేషన్‌ను భవిష్యత్తులో బలోపేతం చేయడానికి మొదటి మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వరంగల్ వ్యవసాయ మార్కెట్ హమాలీ కార్మికులకు ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలని, హమాలీల సంక్షేమం కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ సంఘం నాయకులు బత్తుల అనిల్ కుమార్, సిరిసిల్ల నాగరాజు, మెంతుల మురళి, గోదాసి సురేందర్, ఆకుల సంపత్, మామిడిశెట్టి భద్రయ్య, సురేష్, నాగరాజు, విజయ్, సంపత్, తదితరులు పాల్గొన్నారు.