Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య
నవతెలంగాణ-జనగామ కలెక్టరేట్
పత్తి కొనుగోళ్లను సమన్వయంతో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సీహెచ్ శివలింగయ్య ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో పత్తి కొనుగోళ్లపై వ్యవసాయ మార్కెట్ అధికారులు, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యాజమానులు, జిల్లా అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... జిల్లాలో లక్షా40వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారని, 8లక్షల క్వింటాళ్లకు పైగా పత్తి దిగుబడి వస్తుందని అంచనా ఉందన్నారు. రైతు పండించిన నాణ్యమైన పత్తి రూ.6300 ఉండగా మార్కెట్లో రూ.8వేలకు పైగా ఉందని చెప్పారు. అందుకే సీసీ ద్వారా కొనుగోలు నిర్వహిస్తున్నామన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాల వద్ద సదుపాయాలు మార్కెటింగ్ అధికారులు ఏర్పాటు చేయాల న్నారు. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణ చేపట్టాలన్నారు. ఎలక్ట్రికల్, లీగల్ మెట్రాలజీ, సంబంధిత అధికారులు పర్యవేక్షణ చేపట్టాలన్నారు. కొనుగోలు కేంద్రాలలో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలని, హమాలీ చార్జీలు తీసుకోబడవని బ్యానర్లతో ప్రదర్శింప చేయాలన్నారు. పత్తి విక్రయించే రైతులు ఆధార్, బ్యాంక్ పుస్తకం, పట్టాదారు పాసుపుస్తకం తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. పత్తి కొనుగోళ్లలో సమస్యలు లేకుండా సమన్వయంతో కొనుగోల్లు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్, వ్యవసాయ మార్కెట్ అధికారి నాగేశ్వర శర్మ, వ్యవసాయ అధికారి వినోద్ కుమార్, మార్కెట్ సెక్రెటరీ జీవన్ కుమార్, సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.