Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్‌బెల్ట్
కొన్నేండ్లుగా చేస్తున్న రూరల్ ఎంపవర్మెంట్ కింద జిల్లా సీఎస్సీ టీమ్ చేస్తున్న విస్తత సేవలకు గాను 2022 సంవత్సరానికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించిందని, రూరల్ ఇన్నోవేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించిందని సీఎస్సీ సొసైటీ సభ్యుడు బేతోజు హరికష్ణ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం 'నవతెలంగాణ'తో మాట్లాడారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని టి-హబ్‌లో జరిగిన ఐటీ ఇన్నోవేషన్ సదస్సులో జిల్లా సీఎస్సీ సొసైటీకి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న 100 డిజిటల్ గ్రామాల మోడల్ సీఎస్సీ ప్రాజెక్ట్‌కు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడం ఆనందంగా ఉందన్నారు. రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఆస్పిరేషనల్ జిల్లా అయిన క్రమంలో 100 గ్రామాల్లో నిరుద్యోగ యువతకు ఉపాధితోపాటు మారుమూల గ్రామాల్లోని ప్రజలకు ప్రభుత్వ, ప్రభుత్వేతర సేవలు, బ్యాంకింగ్, సోషల్ సెక్యూరిటీ సేవలు అందించడంలో ఈ కేంద్రాలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. జయశంకర్, ములుగు జిల్లాల్లోని గ్రామాల్లో ప్రాజెక్ట్ అమలు పర్చేందుకు ఇటీవల అధికారులు సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. రెండు జిల్లాలోని వీఎల్ఈలు, స్థానిక ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్లకు, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. అవార్డు అందుకోవడంలో భాగమైన జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు టీమ్ సభ్యులకు హరికృష్ణ కృతజ్ఞతలు తెలిపారు.