Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కోల్బెల్ట్
భూపాలపల్లి ఏరియా ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణాపై డైరెక్టర్ బలరామ్ ఏరియా అధికారులతో శుక్రవారం సమీక్షించారు. తొలుత జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రాను సింగరేణి డైరెక్టర్ బలరామ్, ఏరియా జీఎం శ్రీనివాసరావు మర్యాదపూర్వకంగా కలిసి కేటీకే ఓసి-3 భూసేకరణ ప్రక్రియ గురించి మాట్లాడారు. ఇప్పటివరకు 80 శాతం భూసేకరణ పూర్తి అయ్యిందని, మిగతా భూసేకరణను వేగవంతం చేస్తామని కలెక్టర్ తెలిపారు. డైరెక్టర్ బలరామ్ నిర్వహించిన సమీక్షలో భూపాలపల్లి ఏరియాలో నెలవారీ లక్ష్యం 3.46 లక్షల టన్నులు ఉండగా 1.76 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించినట్టు చెప్పారు. అలాగే రోజువారీగా 6 వేల 293 టన్నుల ఉత్పత్తిని ఛేదించి 51 శాతంలో ఉన్నామని తెలిపారు. వార్షిక లక్ష్యం 19.02 టన్నులు ఉండగా 11.25 లక్షల టన్నులు సాధించి 59 శాతాన్ని చేరుకున్నామని ఏజీఎం (ఐఈడి) జోతి వివరించారు. సంస్థ నిర్దేశించిన రవాణా లక్ష్యం ఎనిమిది వేల టన్నులు ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు 11.26 లక్షల టన్నులు రవాణా చేశామని, రోజువారీగా 6 వేల 224 టన్నుల బొగ్గు రవాణా చేశామని తెలిపారు. ఓబీ రిమూవల్ లక్ష్యం లక్ష క్యూబిక్ మీటర్లు ఉండగా 74 వేల క్యూబిక్ మీటర్లు వెలికితీసినట్టు చెప్పారు. అనంతరం డైరెక్టర్ బలరామ్ మాట్లాడుతూ కొద్ది రోజులుగా కురిసిన అధిక భారీ వర్షాల కారణంగా ఉత్పత్తి, రవాణా లక్ష్యాన్ని ఛేధించలేక పోయిన క్రమంలో మిగిలిన పక్షం రోజుల్లో ఉత్పత్తి, రవాణా, ఓబీ ప్రక్రియను రక్షణతో లక్ష్యాన్ని సాధించేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఏరియా జీఎం శ్రీనివాసరావు, ఇన్ఛార్జి ఎస్ఓ టు జీఎం కవీంద్ర, ఏజీఎం రామలింగం, ఓసి ప్రాజెక్టు ఆఫీసర్లు వెంకట్రామిరెడ్డి, రాజశేఖర్, కేటీకే-1 గ్రూప్ ఏజెంట్ ఎన్వీ రావు తదితరులు పాల్గొన్నారు.