Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు
నవతెలంగాణ-భూపాలపల్లి
రాష్ట్రంలో నూతన విద్యా విధానాన్ని నిలిపేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కార్యకర్తల రాజకీయ శిక్షణ తరగతులకు శుక్రవారం ఆయన హాజరై 'విద్యార్థి ఉద్యమ చరిత్ర-ఎస్ఎఫ్ఐ నిర్మాణం' అంశంపై బోధించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యారంగాన్ని కాషాయీకరణ వైపు మళ్లించడం కోసం కుట్ర చేస్తోందని తెలిపారు. అలాగే విద్యారంగంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకుండా, యూనివర్సిటీల్లోని రీసెర్స్ స్కాలర్లకు ఫెలోషిప్ విడుదల చేయకుండా, ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టులు భర్తీ చేయకుండా యూనివర్సిటీ స్థాయిలో డిపార్ట్మెంట్లు మూతపడుతున్నా పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. ఉన్నత విద్యలో నిధుల కొరత తీవ్రంగా ఉందని, నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకొచ్చి విద్యారంగాన్ని పేద విద్యార్థులకు విద్యను అందని ద్రాక్షలో చేయడం కోసమే ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకొచ్చిందని విమర్శించారు. రాష్ట్రంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యారంగంలో నెలకొన్న ఉపాధ్యాయ, ఎంఈఓ, డీఈఓ పోస్టులు భర్తీ చేయడం లేదని చెప్పారు. అలాగే స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యారంగం పట్ల నిర్లక్ష్య వైఖరి కండ్లకు కట్టినట్టు కనపడుతోందని తెలిపారు. 2017 నుంచి ఇప్పటివరకు నిత్యవసర వస్తువులు ధరలు పెరిగినా విద్యార్థులకు మాత్రం మెస్, కాస్మోటిక్, స్కాలర్షిప్ డబ్బులను పెంచడం లేదన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవి, రాష్ట్ర మహిళా కన్వీనర్ పూజ, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సంతోష్, దామెర కిరణ్, జిల్లా ఉపాధ్యక్షుడు కుమ్మరి రాజు, జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు కిషోర్, సంపత్‌రెడ్డి, జిల్లా నాయకులు కార్తీక్, సాయి, విష్ణు, తదితరులు పాల్గొన్నారు.