Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఏటూర్ నాగారం ఏఎస్పీ, ఎస్సైల అత్యుత్సాహం
- ప్రజా ప్రతినిధులకు సైతం బంగపాటు
నవతెలంగాణ-ఏటూరునాగారం టౌన్
మండల కేంద్రంలోని మాత శిశు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించేందుకు గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ శనివారం ఆస్పత్రికి చేరుకున్నారు. మాతశిశు ఆస్పత్రి ప్రధాన ద్వారానికి రిబ్బన్ కట్ చేసే క్రమంలో మీడియాను ఏఎస్పీ అశోక్‌కుమార్, స్థానిక ఎస్స్కె రమేష్ మీడియాను తోసివేశారు. కెమెరాలు పట్టుకొని మీడియా అనిచెప్పినప్పటికీ కూడా మీకు అనుమతి లేదని, బయట నుండి తీసుకోవాలి అంటూ నెడుతూ పంపించారు. దీంతో మీడియా ప్రతినిదులు పోలీసులు జులుం నశించాలని అంటూ నినాదాలు చేశారు. ఈ విషయంపై మంత్రి సత్యవతిరాథోడ్ , జడ్పీ చైర్మన్ జగదీష్ స్పందించకపోవడంతో మీడియా ప్రతినిదులు కవరేజ్ మధ్యలోనే బయటకు వచ్చేశారు.
ప్రజాప్రతినిధులకు చేదు అనుభవం
మంత్రి సత్యవతిరాథోడ్ ప్రారంభోత్సవానికి వచ్చిన ప్రజాప్రతినిధులను సైతం పోలీసులు అనుమతి ఇవ్వలేదు. స్థానిక ఎంపీపీ విజయ, వెంకటాపురం జెడ్పీటీసీ రమణ, ఇతర ప్రజాప్రతినిధులను మీరు ఎవరు అంటూ రోప్‌పార్టీ బయటనే ఉంచి వేశారు. ఈ విషయాన్ని గమనించి జెడ్పీ చైర్మన్ జగదీష్ వచ్చి మళ్లీ వారిని లోపటికి తీసుకెళ్లారు. అలా పోలీసులు అడుగడుగునా అడ్డుకోవడంపై తీవ్ర విమర్శలను ప్రజాప్రతినిధులు గుప్పించారు. మా ప్రభుత్వంలోనే మాకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు.